తెలంగాణలో మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. శనివారం బిఆర్ఎస్ భవన్ లో జరిగిన సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. మన చంద్రుడు కేసీఆర్ కూడా తాత్కాలికంగా మబ్బుల సాటుకు వెళ్ళాడన్నారు. సిర్పూర్ ప్రజలకు మాటిస్తున్నా.. మన ప్రభుత్వం వచ్చాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పారు. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు…8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచి తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వం అని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి తెలంగాణకు రాకున్నా వాళ్ళు నోరు తెరిచి మాట్లాడడం లేదని విమర్శించారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటే తెలంగాణ తరఫున గొంతెత్తి, గర్జించి, నిలదీసి కొట్లాడితే ఫలితం వేరే లాగా ఉండేదని.. తెలంగాణ గళం, తెలంగాణ బలం, తెలంగాణ దళం.. గులాబీ జెండా, గులాబీ కండువా మాత్రమేనని కెటిఆర్ అన్నారు.