కెవిపి రామచంద్రరావు, షర్మిల, కిరణ్‌కుమార్ రెడ్డిలు బహురూప వేషగాళ్ల రూపంలో వస్తున్నారని, తెలంగాణ వ్యతిరేకులంతా ప్రస్తుతం ఏకమవుతున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో మంగళవారం కెటిఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కెవిపి రామచంద్రరావు, షర్మిల, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం తెలంగాణ వారు కాంగ్రెస్‌ను గెలిపిస్తారంట? తెలంగాణను వ్యతిరేకించిన కెవిపి, షర్మిల కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారని, ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందని మంత్రి కెటిఆర్ వాపోయారు. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలపైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ముసుగులో వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, కెవిపి రామచందర్రావు, షర్మిల వంటి వారంతా ఏకమవుతున్నారని కెటిఆర్ అన్నారు. పైకి కనబడేది కిషన్‌రెడ్డి ఆడించేది కిరణ్ కుమార్ రెడ్డి అని, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కెవిపి రామచంద్రరావు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కెవిపి రామచంద్రరావు ఈ రోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మన కర్మ అని కెటిఆర్ అన్నారు.