Friday, January 10, 2025

అప్పులపై అడ్డగోలు అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

* ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలారు
* ప్రభుత్వం ప్రతి నెలా రూ.6500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారన్నది పచ్చి అబద్ధం
* తెలంగాణ అప్పులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న వడ్డీ రూ.2900 కోట్లు మాత్రమే
* కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై త్వరలో రాహుల్ గాంధీకి లేఖ రాస్తా
* దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు
* కేసీఆర్ మీద కోపంతో చరిత్రను చెరిపేస్తున్నారు
* నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుంది
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 7లక్షల కోట్లు అప్పు అని దుష్ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలు చెప్పడంలో సీఎం రాటుదేలి పోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన నోటివెంట ఎప్పుడూ అబద్ధాలే వస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తయినా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. అబద్ధాలతో సీఎం తన మంత్రివర్గ సహచరులను, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అప్పులకు తన ప్రభుత్వం ప్రతి నెల రూ.6500 కోట్ల వడ్డీ చెల్లిస్తోందని సీఎం చెబుతున్నారని, అది కూడా పచ్చి అబద్ధమని అన్నారు.

తెలంగాణ అప్పులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న వడ్డీ రూ.2900 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ డాక్యుమెంట్‌లు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు ప్రభుత్వం వడ్డీల రూపంలో కేవలం రూ.2164 కోట్లు మాత్రమే చెల్లించినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని కేటీఆర్ అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ముందుగా తన ప్రవర్తనను మార్చుకుని, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేయడం మానుకోవాలని సూచించారు. హరీష్‌రావుపై తప్పుడు కేసు పెట్టారని, అలాంటి కేసులకు తాము భయపడబోమని అన్నారు.

రాహుల్ గాంధీకి లేఖ రాయబోతున్నా : తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుల గురించి కాదు..హామీల గురించి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిత్యం అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై త్వరలో రాహుల్ గాంధీ కి లేఖ రాస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఇద్దరు తప్ప ఎవరూ బాగుపడలేదని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ కాదు..రేవంత్ బ్రదర్ రైజింగ్ అని అన్నారు.

కేసీఆర్ మీద కోపంతో చరిత్రను చెరిపేస్తున్నారు : కేసీఆర్ మీద కోపంతో చరిత్రను చెరిపేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పదేళ్ల పాలనలో బతుకమ్మ, బోనాల పండుగలకు రాష్ట్ర పండుగలుగా జరుపుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేశామని అన్నారు. తాము పార్టీ నాయకుల పేర్లు పెట్టి ఏ కార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు. తెలంగాణ చరిత్ర శాశ్వతంగా నిలవాలనే ప్రయత్నం చేశామన్నారు. కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల దేవుళ్ల పేర్లు పెట్టామన్నారు.

కొత్త జిల్లాలకు ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం పేర్లను పెట్టుకున్నామని పేర్కొన్నారు. సింహాలు తమ గాథ చెప్పుకోకపోతే వేటగాళ్ల పిట్ట కథలే సత్యాలు అవుతాయన్నారు. యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేస్తారని.. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోందని ఆక్షేపించారు. కేసీఆర్ మీద కోపం, అక్కసుతో చరిత్రను చెరిపేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనులు గురించి రేవంత్ రెడ్డి ఎన్నడూ మాట్లాడరని అన్నారు. మూర్తీభవించిన తల్లిలా తెలంగాణ తల్లిని ఉద్యమ సమయంలో రూపొదించారని, తమ నాయకుడి మీద ఆక్రోశంతో నేడు ఆ తల్లి రూపాన్నే మార్చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

సీఎం రేవంత్‌కు ఫామ్ హౌస్ రాసిస్తా : జోసెఫ్ గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని, సంవత్సరం కాలంలో బీఆర్‌ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్ అనారోగ్యం, కవిత జైలుకు వెళ్లడం, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా బీఆర్‌ఎస్ తట్టుకుని నిలబడిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందని తెలిపారు. మరో నాలుగేళ్లు బీఆర్‌ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో లక్ష కోట్ల అప్పులు, ప్రజల తిప్పలు అని సెటైర్ వేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పులు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం తప్పులపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సోదరులకే లాభం జరిగిందన్నారు. రాష్ట్రంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి ఆయన కుటుంబం ఎదిగిందని చెప్పుకొచ్చారు. ఫోర్బ్ జాబితాలో రేవంత్ రెడ్డి కుటుంబం ఉంటుందేమో చూడాలన్నారు. తరచూ రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి పరువు తీస్తున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ ఎందులో రైజింగ్‌లో ఉందో చెప్పాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి విలువలు ఉండవని, డబ్బు సంచులతో దొరికిన దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంతో పాటు మంత్రులకు కూడా అవగాహన లేదని విమర్శించారు. 2023లో రెవెన్యూ మిగులు రూ.5944 కోట్లుగా ఉందని చెప్పారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే చూపించాలని, నిరూపిస్తే అది రేవంత్ కే రాసిస్తానని కీలక ప్రకటన చేశారు.

నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుంది : రేవంత్ రెడ్డీ..నువ్వెన్ని కథలు పడ్డా నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడ తెలంగాణ తల్లి కచ్చితంగా నిటారుగా నిలబడుతుందన్నారు. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కానీ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత రూపాన్ని వాజ్ పేయి అధికారంలోకి వచ్చాక మార్చలేదన్నారు.

దేశంలో ఎన్నోచోట్ల అధికార మార్పిడి జరిపినప్పటికీ ఆయా రాష్ట్రాల విగ్రహాల రూపును మార్చలేదన్నారు. తెలంగాణ తల్లి రూపును మాపే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలన్నారు. అధికారం ఉందని పోలీసు బలగాల మధ్య మీ నాటకాలు కొంతకాలం మాత్రమే సాగుతాయని, కానీ ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. అంబేద్కర్ సచివాలయం గురించి, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007 ఉద్యమ కాలంలో రూపొందించినట్లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News