వచ్చే నాలుగేళ్లు ప్రభుత్వంపై అవిశ్రాంత
పోరాటం ఇది తెలంగాణ భవన్
కాదు..జనతా గ్యారేజ్ 33జిల్లాల
కార్మిక విభాగాలకు మంచి నాయకులను
ఎన్నుకోవాలి తెలంగాణ భవన్‌లో
జరిగిన కార్యక్రమంలో బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నాలుగేళ్లు కాం గ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించే బాధ్యతను బిఆర్‌ఎస్ కార్మిక విభాగం తీసుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రతిక్షణం గుర్తు చేద్దామని పేర్కొన్నారు. 33 జిల్లాలకు బిఆర్‌ఎస్ కార్మిక విభాగానికి కొత్త కమిటీలను కొత్త నాయకులను ఎ న్నుకోవాలని తెలిపారు. రేవంత్ రెడ్డికి చుక్కలు చూ పించే నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. కేసులకు భయపడొద్దు, కేసుల గురించి పార్టీ నాయక త్వం, లీగల్ సెల్ కార్మిక విభాగానికి అండగా
ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్‌ను కె టిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, శాసమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఇది తెలంగాణ భ వన్ కాదు తెలంగాణ జనతా గ్యారేజ్ అని,ప్రజల కు తెలంగాణ భవన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాం గ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బిఆర్‌ఎస్ కా ర్మిక విభాగం పోరాడుతుందని పేర్కొన్నారు. హ మాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చా లా మంది ము ఖ్యమంత్రులు
ఈ రాష్ట్రంలో పనిచేశారని, కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. కెసిఆర్ సిఎం కాకముందు ఎనిమిది రూపాయలు ఉన్న హమాలీ కూలీ ఆయన హయాంలోనే 26 రూపాయలకు చేరిందని తెలిపారు. కరోనా కాలంలో కెసిఆర్ చెప్పే మాట వినేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా టీవీల ముందు ఎదురుచూశారని అన్నారు. 35 లక్షల మంది వలస కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అన్న కెసిఆర్ మనసున్న ముఖ్యమంత్రిగా, కార్మిక పక్షపాతిగా నిలిచారని చెప్పారు. కరోనా కాలంలో వలస కార్మికులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సహాయం చేసి, భోజనం పెట్టి ప్రత్యేకంగా రైళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ స్వస్థలాలకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కెసిఆర్ ఒక్కరే అని వ్యాఖ్యానించారు. వలస కార్మికులు తెలంగాణ వాళ్లు కాదని తెలిసినా, వాళ్ళు ఎవరూ తనకు ఓటు వేయరని తెలిసినా కూడా మనసున్న ముఖ్యమంత్రిగా కార్మిక పక్షపాతిగా కెసిఆర్ వాళ్ల కోసం పనిచేశారని తెలిపారు.
సఫాయి అన్నా నీకు సలాం అన్న సిఎం కెసిఆర్
2004లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా వేలాది ఇండ్లను కెసిఆర్ మంజూరు చేశారని కెటిఆర్ అన్నారు. అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2005వ సంవత్సరంలోనే కార్మిక శాఖ మంత్రిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పించి అర్జున్ సైన్ గుప్తా అనే ఆర్థికవేత్త ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను అందులో మెంబర్‌గా చేసి ఒక నివేదిక తయారు చేయించారని చెప్పారు. సఫాయి అన్నా నీకు సలాం అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కెసిఆర్ తప్ప ఇంకెవరూ లేరని పేర్కొన్నారు. సఫారీ కార్మికుల సంక్షేమం కోసం కెసిఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని, ఒక్క జిహెచ్‌ఎంసిలోనే సఫాయి కార్మికులకు మూడు సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. ఆనాటి పాలకులు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కెసిఆర్ అదే అంగన్వాడీ టీచర్లకు 4500 ఉన్న జీతాన్ని 13,650కి పెంచారని, మినీ అంగన్వాడి టీచర్లకు 2200గా ఉన్న జీతాన్ని 7800 చేశారని గుర్తు చేశారు. 2014లో ఆశా వర్కర్లకు 2,500 రూపాయల జీతం ఉంటే దాన్ని 9,750కు పెంచారని పేరొన్నారు.
మున్సిపల్ కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు అని, అయినా ముఖ్యమంత్రి ఫస్ట్ తారీకు జీతాలు ఇస్తుందని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా కెసిఆర్ తెలంగాణను నిలిపారని వ్యాఖ్యానించారు. మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 12 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఆర్‌సిని వర్తింప చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే అని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్‌సి వర్తింప చేయలేదని, కెసిఆర్ వచ్చినంకనే అది ఆనవాయితీగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిఆర్‌సి ఇవ్వక తప్పదని అన్నారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని రాహుల్ గాంధీతో హామీ ఇప్పించారు కానీ ఇప్పటిదాకా దాని గురించి అతీ గతీ లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్ల కోసం ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
గుడి పూజారులకు మస్జిద్ల మౌలానా, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కెసిఆర్ అని కెటిఆర్ తెలిపారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా భారతదేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కెసిఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు, క్యాబ్ ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా చ్చిన నాయకుడు కెసిఆర్ అని చెప్పారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు అన్న కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్మిక విభాగం మీద ఉందని అన్నారు.
భూముల విలువ పెరిగితే కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుందని,అందుకే కెసిఆర్ భవిష్యత్తుపై ఒక విశ్వాసం ఏర్పడేలా భూముల విలువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి బక్వాస్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు మన రాష్ట్రానికి ఉన్న అప్పు 72 వేల కోట్ల రూపాయలు అని, రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష 14 వేల రూపాయలు, 369 కోట్ల రెవెన్యూ మిగులు ఉండేదని చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారం నుంచి దిగిపోయే సమయానికి తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల 56 వేల రూపాయలు అని, 5944 కోట్ల రూపాయల రెవిన్యూ సర్ ప్లస్ రాష్ట్రంగా తెలంగాణను కెసిఆర్ మార్చారని తెలిపారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌తో కాంగ్రెస్ వాళ్లకు రాష్ట్రాన్ని అప్పగించామని వెల్లడించారు.
రూ.లక్ష 40 వేల కోట్ల అప్పు చేసి సిఎం చేశారో ప్రజలు నిలదీయాలి
తెలంగాణ భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్క దాన్ని కెసిఆర్ నిర్మించారని కెటిఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్టు, దామెరచర్ల విద్యుత్ కేంద్రం, యాదాద్రి గుడి, 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు, 2600 రైతు వేదికలు, లక్ష కోట్ల రూపాయలు రైతులకు ఖాతాల్లో వేయడం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం కెసిఆర్ పెట్టుబడి పెట్టారని వివరించారు. 50 ఏళ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మొత్తం తెలుసు అని ఆనాడు ఓ టివి చర్చలో భట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు. సంపద సృష్టించడం తమకు తెలుసు అని కాంగ్రెస్ నాయకులు గప్పాలు కొట్టారని, వంద రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ఆనాడు ఎన్నికల ప్రచారంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు. 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటిదాకా రిటైర్మెంట్ ప్రయోజనాలు రాలేదని, పెన్షన్లు రావడం లేదని పేర్కొన్నారు. ఐదు డిఏలు ఉంటే ఒకటే ఇచ్చారని, పిఆర్‌సి దిక్కు చూడలేదని విమర్శించారు.
జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారని మండిపడారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పుడు బడ్జెట్ ఎంత..? ఆనాడు అప్పు ఎంత ..? ఆస్తులు ఎన్ని..? అని అడిగారు. సంవత్సరానికి 40 వేల కోట్ల అప్పుచేసి కెసిఆర్ ఎన్నో పనులు, పథకాలు, ప్రాజెక్టులను నిర్మించారని, లక్షా నలభై వేల కోట్ల రూపాయల అప్పును ఒక్క సంవత్సరంలోనే చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఒక కొత్త పని చేశారా..?…రైతుబంధు పెంచారా..? ఒక కార్మికుడికైనా లాభం చేసిండా..? ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇచ్చిండా..? ఆడబిడ్డల లగ్గానికి తులం బంగారం ఇచ్చిండా.. చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇచ్చిండా..? అని నిలదీశారు. ఇవన్నీ చేయకుండానే సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయల అప్పు రేవంత్ రెడ్డి ఎలా చేసిండో తెలంగాణ ప్రజలు నిలదీయాలని, ఆ పైసలన్ని ఎక్కడికిపోయినయో అడగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఒక్క మేలు కూడా చేయని రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రం మూటల్ని మోసే పనిని నిజాయితీగా చేశారని విమర్శించారు. తన పదవి కాపాడుకోవడం కోసం వేల కోట్ల రూపాయలను ఢిల్లీకి తరలించుకుపోయారని కెటిఆర్ ఆరోపించారు.