మనతెలంగాణ/హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/కాటారం/మహాదేవపూర్: శాసనసభ సమావేశాలు ముగిసేలోపు(ఆగస్ట్ 2) కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కెసిఆర్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టికొట్టే దుర్మార్గపు ఆలోచన చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు కెటిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర నాయకుల బృందం రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గురువారం కరీంనగర్‌లోని ఎల్ఎండీ ప్రాజెక్ట్‌ను, శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను బిఆర్ఎస్ నాయకులు సందర్శించారు.
మార్గ మధ్యలో కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. అక్కడే గోదావరి నదికి ప్రత్యేక పూజాలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం రైతులను బలి పెట్టవద్దని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాం సాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లిలో నీరు లేని కారణంగా రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు గోదావరి ఎగువన నీటి కరువు ఉంటే…మేడిగడ్డ వద్ద మాత్రం పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. ఈ నీటిని సకాలంలో ఎత్తిపోసుకుంటే శ్రీరాంసాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేర్, రంగనాయకమ్మ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశయాలను నింపుకొని నీటి కొరత లేకుండా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కెసిఆర్‌పై కక్షతో నీటిని ఎత్తిపోయటం లేదు: కెసిఆర్‌పై కోపం, రాజకీయ కక్షల కారణంగానే నీటిని ఈ ప్రభుత్వం ఎత్తిపోయటం లేదని కెటిఆర్ విమర్శించారు. పైన నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు నీటిని ఎత్తిపోయకుంటే వానాకాలం పంట కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. గతేడాది తమ ప్రభుత్వం సకాలంలో నీటి ఎత్తిపోసి ఎల్ఎండీ, మిడ్ మానేర్ సహా రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల పంటలు ఎండిపోయిన సరే కెసిఆర్‌కు పేరు రావద్దన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత డిసెంబర్- జనవరిలో కూడా రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరితే రాజకీయ ప్రయోజనం కోసం రైతుల పంటలను ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకే రాజకీయాలు చేద్దామని…ఆ తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పనిచేద్దామన్నారు. బేషజాలకు పోయి, రైతులకు అన్యాయం చేయవద్దని సూచించారు.
కెసిఆర్‌ను బద్నాం చేయనికే ప్రయత్నాలు
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి కెసిఆర్‌ను గద్దె దింపేందుకు అన్ని కుట్రలు చేశాయని ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ పేరుతో ఒక్కరోజులోనే నివేదిక ఇచ్చి మేడిగడ్డకు ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ కూడా కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అంటూ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. మొత్తానికి మీరు చేసిన కుట్రలతో కెసిఆర్‌ను గద్దె దించారని ఇంకా రాజకీయాలెందుకని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సుందిళ్ల, అన్నారం లో ఏదో ప్రమాదం అంటూ ఎన్డిఎస్ఎ పేరుతో సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుందిళ్ల, అన్నారంలో డ్రౌటింగ్ పనులు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్‌లో భాగమేనని అధికారులు చెప్పారన్నారు. బ్రహ్మండంగా నీటి ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉందని ఒక్క ప్రభుత్వం నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారని అన్నారు.
ఎందుకింత నిర్లక్ష్యం: కాళేశ్వరంపై కెసిఆర్ మీద చేసిన తప్పుడు ప్రచారాలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని కెటిఆర్ అన్నారు. బంగారు పల్లెంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించి పెట్టినట్లు కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసి ఇచ్చారని పేర్కొన్నారు. దాన్ని కూడా వాడుకోలేని దౌర్బగ్యపు పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తెలంగాణలో కరువు అనే పదమే ఉండకుండా చేసేందుకే కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైన బహుళార్థక ప్రాజెక్ట్‌ను కెసిఆర్ తన సంకల్ప బలంతో పూర్తి చేశారని కెటిఆర్ గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కామధేనువు, కల్పతరువని చెప్పారు. గతంలో కాళేశ్వరం విషయంలో కెసిఆర్‌ను బద్నాం చేశాం.. ఇప్పుడు పంప్‌లు ఆన్ చేస్తే కెసిఆర్‌పై చేసిన ప్రచారం తప్పని తేలుతుందని కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారన్నారు. అయితే తమపై దుష్ప్రచారం చేసిన సరే ఇప్పుడు రైతులకు మేలు చేయండని మాత్రమే మేము కోరుతున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని వారికి మంచి చేసేందుకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అదే విధంగా ఆగస్ట్ 2 తర్వాత కూడా పంప్ లు ఆన్ చేయకపోతే…కాళేశ్వరం ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులందరితో కలిసి వచ్చి మోటార్లను ఆన్ చేస్తామని కెటిఆర్ హెచ్చరించారు.