Thursday, January 23, 2025

ప్రియాంక.. క్షమాపణ చెప్పు

- Advertisement -
- Advertisement -

రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు
పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతోంది
పియాంకగాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకోవాలి
ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు,
ప్రైవేటు రంగంలో 22 లక్షలకుపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం
ప్రియాంకగాంధీ పర్యటనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతోందన్నారు. ప్రియాంకగాంధీ పర్యటనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకగాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకుని తెలంగాణ ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలని కెటిఆర్ సూచించారు. కాంగ్రెస్, బిజెపిలకు ఒక పాలసీ అంటూ ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు యువతకు క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైన ప్రియాంకగాంధీ కాంగ్రెస్ తరపున క్షమాపణ చెప్పాలని కెటిఆర్ సూచించారు. సోనియాగాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పిసిసి చీఫ్ పదవి ఇచ్చారని, గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు.

పొలిటికల్ టూరిస్టులకు నగరం స్వాగతం పలుకుతోంది
హైదరాబాద్ విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటుందని లక్షలాది మంది టూరిస్టులకు స్వాగతం పలుకుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే ప్రియాంక గాంధీ లాంటి పొలిటికల్ టూరిస్టులకు కూడా స్వాగతం పలుకుతుందన్నారు. అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్‌పై దింపుడు కళ్లెం ఆశతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని కెటిఆర్ సూచించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నగరంలోకి వచ్చే సమయంలో కనిపించే అందమైన రోడ్లు, అద్భుతమైన ప్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జి లాంటి అధునాతన నిర్మాణాలు, ప్రపంచ దిగ్గజ ఐటి కంపెనీల కార్యాలయాలు చూసైనా పరిపాలన పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఊహించనంత వేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం న్యూయార్క్ ను తలపిస్తోందన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి ప్రముఖులు ఇటీవల చేసిన ప్రశంసల గురించి కాంగ్రెస్ లీడర్లను అడిగి తెలుసుకోవాలని ప్రియాంకగాంధీకి కెటిఆర్ సూచించారు. నిజాలు చెప్పడానికి వాళ్లు కాస్త మొహమాటపడొచ్చని, అయితే ఒకటికి రెండు సార్లు అడిగితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వాళ్లే గుక్కతిప్పుకోకుండా చెబుతారన్నారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివే కాంగ్రెస్ మార్క్ సంస్కృతిని పక్కనెట్టి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఆవో, దేఖో, సీఖో అని ప్రియాంకగాంధీకి కెటిఆర్ చురకలంటించారు.

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బిజెపిలు స్పందించలేదు
ఇన్నేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్రస్టేషన్‌లో ఉందని కెటిఆర్ తెలిపారు. 9 ఏళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. తప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులు ఆపిన సొంత పార్టీ నాయకులకు ప్రియాంక గాంధీ బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ మాదిరిగానే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు పనిచేస్తే ఏ ఒక్కరూ నిరుద్యోగిలా మిగిలేవారు కాదన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా యువతను కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయ్యిందన్నారు. యువ సంఘర్షణ సభ పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు, కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, యువతకు చేసిన మంచి పనుల గురించి చెబితే బాగుంటుందని కెటిఆర్ సూచించారు.

రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదు
రాజకీయ నిరుద్యోగులుగా మారిన కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎపిపిఎస్సీ ద్వారా కాంగ్రెస్ భర్తీ చేసిన నియామకాలెన్ని ? కేవలం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలెన్నో తెలుసుకోవాలన్నారు. రాత పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు ఇంటర్వ్యూల్లో అన్యాయం చేసిన నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా తమ కళ్ల ముందే కదలాడుతున్నాయన్నారు. నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను కాసుల కమిషన్‌గా మార్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడొచ్చి నీతులు చెబితే ఎవరూ నమ్మరని కెటిఆర్ పేర్కొన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన మహోన్నత తెలంగాణ ఉద్యమంలో జరిగిన వందలాది యువత ప్రాణ త్యాగాలకు కాంగ్రెస్ ముక్కనేలకు రాసి క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ మాట తాను మాత్రమే అనడం లేదన్న కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువకుల బలిదానాలకు కారణం అప్పటి కాంగ్రెస్ అధినాయకత్వమే అని సోనియాగాంధీని బలిదేవత అన్న తమ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటల మేరకైనా తెలంగాణ యువతకు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ కాలంలో చేసిన ద్రోహాలకు క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

తడారిన గొంతులకు మిషన్ భగీరథతో జలాభిషేకం
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి సెంటర్‌గా ఉన్న తెలంగాణ తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఎదిగిందని కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్లు నడిచిన తండ్లాటను తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా మరిచిపోలేదన్న సంగతిని ప్రియాంకగాంధీ గుర్తుంచుకోవాలన్నారు. తడారిన గొంతులకు మిషన్ భగీరథ తో జలాభిషేకం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎప్పటికీ అండగా ఉంటామని, ప్రతి తండా చేస్తున్న ప్రతిజ్ఞ ఎక్కడికెళ్లినా ప్రియాంకగాంధీకి వినిపిస్తుందన్నారు.

ఒక్క పంటకు కూడా సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ చేతకానితనంతో ఒకప్పడు కమ్ముకున్న దుర్భిక్ష ఛాయలు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు అనడానికి కోటి ఎకరాల సిరుల మాగాణమే సాక్ష్యమన్నారు. ప్రాజెక్టు కట్టకముందే కాలువలు తవ్వి కమీషన్లు జేబులో వేసుకున్న కాంగ్రెస్ పాలన లెక్క కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను మెరుపు వేగంతో పూర్తిచేసిన ఘనత బిఆర్‌ఎస్ సొంత మన్నారు. నాలుగేళ్లలోనే ఇంత భారీ ప్రాజెక్టును పూర్తిచేసిన కెసిఆర్ పట్టుదల గురించి ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు చెప్పి అక్కడి ప్రజలకు మేలుచేయాలని కెటిఆర్ సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తుంటే తప్పుడు కేసులు వేసి అభివృద్ధి నిరోధకులుగా వ్యవహారిస్తున్న సొంత పార్టీ నాయకులకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలన్నారు.

కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చే కాలిపోయే మోటార్లు
కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునే దుస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉందేమో కానీ, తెలంగాణలో మాత్రం ఎక్కడా లేదని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ల దుస్థితిని రూపుమాపీ రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక పాలకుడు కెసిఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పెట్టుబడికే కాదు పంట నష్టపోయినా అన్నదాతకు పదివేల సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రాబంధు పాలనకు కెసిఆర్ రైతుబంధు పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను తెలంగాణ సమాజం ఎప్పుడో గుర్తించిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రూ. 200 చాలీచాలని పెన్షన్‌తో ఇబ్బందులు పడ్డ బతుకులు కెసిఆర్ ఇస్తున్న రెండువేల రూపాయల పెన్షన్‌తో ఆత్మాభిమానాన్ని నింపుకున్నాయన్నారు.

2004లో తెలంగాణ ఇచ్చి ఉంటే..
2004 కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగి ఉండేవి కాదన్న సత్యాన్ని ప్రియాంకగాంధీ తెలుసుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు. సుదీర్ఘ ఉద్యమంలో ఏనాడు ప్రజల పక్షాన నిలబడకుండా ఇప్పుడొచ్చి మాట్లాడితే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం నమ్ముతుందన్న భ్రమలో ఉండొద్దని కెటిఆర్ హితవు పలికారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో సాగుతున్న మానవీయ పాలన గురించి అధికారంలో ఉన్న ఒకటి అరా కాంగ్రెస్ ప్రభుత్వాలకు సోదాహరణంగా వివరించి ప్రజల మెప్పు పొందాలని ప్రియాంకగాంధీకి కెటిఆర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News