రాష్ట్రానికి వరద సాయంపై కేంద్రమంత్రి తప్పుడు లెక్కలు
ప్రత్యేక నిధులపై ఆయనకు అవగాహన లేదు
ఎలాంటి విపత్తు లేకుండానే ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులు వస్తాయి
అదనంగా కేంద్రం ఇచ్చిందేమీ లేదు
ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధుల కింద 2018 నుంచి తెలంగాణకు పైసా ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి నిత్యానంద్
రాయ్ ప్రకటన అవాస్తవమా?
సొంత రాష్ట్రానికి నయా పైసా సాయం తీసుకరాని, చేతకాని మంత్రి కిషన్ రెడ్డి
నిప్పులు చెరిగిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: వరద సాయంపై కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్ని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు, ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా కొనసాగుతుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని ఇటీవల పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తే…దానికి తెలంగాణకు రాజ్యాంగబద్దంగా, హక్కుగా రావాల్సిన ఎస్‌డిఆర్‌ఎఫ్ గణాంకాలు వెల్లడించారని మండిపడ్డారు. తప్పుడు గణాంకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నాననే విషయాన్ని కూడా మరిచిపోయి…మరి నిర్లజ్జగా అబద్దాలు చెప్పారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం విడుదల ఒక పత్రికా ప్రకటనలో మంత్రి కెటిఆర్ పేర్కొంట్తూ…వరద సాయంలో కేంద్రం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను గణాంకాలతో సహా వివరించారు. అలాగే తనదైన శైలిలో కిషన్‌రెడ్డితో పాటు కేంద్రంపై పెద్దఎత్తునసెటైర్లు వేశారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి విపత్తులు లేకున్నా రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్‌డిఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్)కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కింది ఏమిటో చెప్పాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను కేంద్రమే విడుదల చేసినట్లు కేంద్రమంత్రులు చెప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల నుంచి తిరిగి రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులు కూడా ఒకటన్నారు. ఈ విషయంపైన కిషన్‌రెడ్డికి అవగాహన లేకపోవడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు.
అబద్దాలు అలవాటుగా మారింది
రాష్ట్రంలో వరదలు విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ వరదలతో పాటు ప్రస్తుతం వచ్చిన వర్షాలు, వరదల నష్టంపైన కేంద్రం సహాయం చేయాలని నిలదీస్తే తమకు అలవాటైన అబద్దాలనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్లెవేస్తున్నారన్నారని కెటిఆర్ అన్నారు. దమ్ముంటే ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన అదనపు నిధులపైన కిషన్ రెడ్డి మాట్లాడాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఈ నెల 19వ తేదిన కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను మరోసారి చదవాలని కిషన్‌రెడ్డికి కెటిఆర్ హితవు పలికారు.
ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రానిదే
రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంటుందని కెటిఆర్ అన్నారు. దయచేసి ఈ విషయాన్ని కిషన్‌రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. ఇదే ప్రకటనలో 2018 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి ఇయ్యలేదని ప్రకటించిన మాట వాస్తవం కాదా? అని కెటిఆర్ నిలదీశారు. స్వయంగా తన సహచర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన అవాస్తవమా? లేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో మోసం చేస్తున్నారో తెల్చి చెప్పాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చైర్మన్‌గా ఉన్న హైలెవెల్ కమీటి ఇచ్చే ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులు అడిగే దైర్యం కిషన్‌రెడ్డికి లేకనే అబద్దాలు చేబుతున్నారని మండిపడ్డారు.
2018 నుంచి రాష్ట్రానికి ఒక్క పైసా రాలేదు
2018 నుంచి రాష్ట్రానికి ఇప్పటిదాకా ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధుల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి ప్రకటన చేశారన్నారు. పార్లమెంట్‌లో ఆ కేంద్ర మంత్రి చేసిన అబద్ధమా? లేదా కిషన్ రెడ్డి చేసిన పత్రికా ప్రకటన అబద్ధమా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపైన అభాండలు వేసిన కిషన్‌రెడ్డి వెంటనే రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌కు రూ.3500 కోట్లు అడిగితే…..
గతంలో హైదరాబాద్‌లో ఎప్పుడు లేనివిధంగా వర్షాలతో అతలాకుతలమైనప్పుడురాష్ట్ర ప్రభుత్వం అడిగిన సుమారు రూ. 3500 కోట్ల ప్రత్యేక సహాయంపైన ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదన్నారు. తాజాగా కురిసిన భారీ వర్షాల వలన జరిగిన ప్రాథమిక నష్టం 1,400 కోట్లగా తేలిందననారు. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులు అందించాలని కోరితే కేవలం బృందాలను పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విమర్సించారు. హైదరాబాద్ వరదల అనంతరం కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం రూపొందించిన నివేదిక ఏమైందో ప్రజలకు వివరించాలన్నారు. ప్రత్యేక సహాయం కేంద్రం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాల వలన రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని…. కేవలం రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకే కేంద్రం బృందాలను పంపుతోందని ఆరోపించారు.
అదే గుజరాత్‌కు వరదలు వస్తే…..
బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు తౌక్టే తుఫాన్ వలన గుజరాత్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి 2021లో రూ. 1000 కోట్లను ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులను అదనపు సహాయాంగా అడ్వాన్స్ రూపంలో విడుదల చేశారన్నారు. మరి అక్కడి ప్రజల కష్టాలు కనిపించిన మోడీకి తెలంగాణ ప్రజలు అవసరం లేదా? అని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని వివక్షపూరిత వైఖరిని నిక్కచ్చిగా కొనసాగిస్తున్నారన్నారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బృందాలను పంపి… బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులు మూటలు పంపుతున్న వివక్షపూరిత కేంద్రం ప్రభుత్వం ఢిల్లీలో ఉందన్నారు. బిజెపి అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల (బీహార్‌కు రూ.3,250కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.4,530 కోట్లు, కర్నాటకకు రూ. 6,490 కోట్లు, గుజరాత్‌కు రూ.1000 కోట్లు )కు 2018 నుంచి ఇప్పటి వరకు రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్రం…. తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు కూడా ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా అదనపు నిధులు తీసుకొచ్చే దమ్ము…. కిషన్ రెడ్డికి ఉందా? అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు క్షమాపలు చెప్పాలి
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా అబద్ధాలు చెబుతున్న కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సొంత రాష్ట్రంపైన కొంతైనా ప్రేమ ఉంటే…. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్‌డిఆర్‌ఎఫ్
అదనపు నిధుల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. లేకుంటే 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా అదనంగా అందించని తమ కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి నిజమని ఒప్పుకోవాలన్నారు. అలాకానీ పక్షంలో సొంత రాష్ట్రానికి నయా పైసా సాయం తీసుకురాని చేతకాని కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని కెటిఆర్ ఎద్దేవ చేశారు.
KTR Slams Kishan Reddy over Flood Relief