Thursday, January 23, 2025

యువతపై పోలీసుల అత్యుత్సాహం వద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర యువతపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తప్పుపట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిజిపి జితేందర్‌కు కెటిఆర్ పలు సూచనలు చేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ పోలీసులు తమ వృత్తి పట్ల వ్యవహరించే ప్రొఫెషనలిజం తీరుకు మంచి పేరు ఉందని, అది పోకుండా వెంటనే కాపాడుకోవాలని సూచించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంత మంది పోలీసులను అదుపు చేయాలని, ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పోలీసుల పేరును పూర్తిగా చెడగొడుతుందని వ్యాఖ్యానించారు. తొర్రూరు నియోజకవర్గంలో మాలోతు సురేష్ బాబు అనే గిరిజన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్రూరంగా హింసించారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శాసన సభ్యురాలికి వ్యతిరేకంగా వాట్సాప్‌లో పోస్ట్ చేయడమే ఆయన చేసిన నేరమా..? అని ప్రశ్నించారు. సామాజిక మధ్యమాల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బిఆర్‌ఎస్ శ్రేణులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కెటిఆర్ తప్పుబట్టారు.

ఈ మహా నగరానికి ఏమైంది..? 
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. నగరంలో శాంతి భద్రతలపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘బ్రాండ్ హైదరాబాద్’ ఎందుకు మసకబారుతోంది..? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతోందని కెటిఆర్ ప్రశ్నించారు. సగటు హైదరాబాదీకి కలుగుతున్న భావన ఇది అని, హైదరాబాద్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన ఇదని పేర్కొన్నారు.

పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో పెరిగిపోతున్న వరుస హత్యలు, పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాల కారణంగా రాజధాని హైదరాబాద్‌లో శాంతి, నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని ఆక్షేపించారు. సిఎం స్వయంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తున్నా, పోలీసింగ్‌పై కమాండ్ ఏదని, క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏదని ప్రశ్నించారు. ఓవైపు కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని ఆరోపించారు. మరోవైపు పడగవిప్పిన హత్యల సంస్కృతి ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు తరలిపోతున్న పెట్టుబడుల పర్వం యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News