Thursday, January 23, 2025

రాహుల్ వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

KTR Slams Rahul Gandhi over Paddy

మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా రచ్చ చేస్తోంది. దాదాపు అన్ని పార్టీలు ఈ విషయాన్ని ఏదో విధంగా లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్ పార్టీలు ధాన్యం కొనుగోలు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు తప్పుబట్టారు. రాహుల్‌గాంధీ స్పష్టంగా తప్పుడు సమాచారం అందిస్తున్నారనీ, వాస్తవ పరిస్థితులపై తప్పుదారి పట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ బిజెపి ప్రతిపక్ష కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. అంతకు ముందు ధాన్యం కొనుగోలు అంశాన్ని టిఆర్‌ఎస్, బిజెపి ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి కెటిఆర్ స్పందిస్తూ… దశాబ్దాలుగా దేశంలోని రైతులను నిర్లక్షం చేసిన కాంగ్రెస్ ముందుగా వారికి క్షమాపణలు చెప్పాలని ఆయన వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. పదే పదే తెలంగాణ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించిన ఢిల్లీలో అధికారంలో ఉన్న వారిపై తన విమర్శలను మళ్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి సూచించారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును పోల్చడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.ఈ దేశాన్ని 50 ఏళ్లుగా పైగా పాలించే అవకాశం కాంగ్రెస్‌కు లభించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు కష్టాలు, ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని ఆరోపించారు. రైతులకు 6 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అయితే, తమ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో మెరుగైన పాలన అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, నీటిపారుదలపై దృష్టి సారించి వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో అందించలేకపోయిన దానిని తమ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో అందించిందని తెలిపారు.

KTR Slams Rahul Gandhi over Paddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News