Saturday, December 28, 2024

కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా ఉంది
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు
దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, గురుకులాల్లో విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి మారిందని మండిపడ్డారు. కేవలం ఏడాది పాలనలో ప్రజలతో ఇన్ని తిట్లు తిన్న పాలకులు గతంలో ఎవ్వరూ లేరని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ శ్రేణులను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29 నిర్వహించననున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహాక సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎంఎల్‌సి మధుసూదనా చారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పాటు బిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కెటిఆర్ పిలుపునిచ్చారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని నగర ప్రజలకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిషిని కావాలని భావిస్తున్నాడని….కానీ కెసిఆర్‌లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించటం లేదని అన్నారు. మూసీ, హైడ్రా, ఆటో డ్రైవర్లు…ఇలా నగర ప్రజలపై పగ పెంచుకుని కాంగ్రెస్ సర్కార్ వారిని వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెడుతున్న బాధలను చెప్పుకునేందుకు ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని…తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందని అన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మనమే గెలుస్తాం:

కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. వెలుగు విలువ చీకటి ఉన్నప్పుడే తెలుస్తుందని…కెసిఆర్‌ను పొగొట్టుకున్నామని ప్రజలంతా ఆవేదనలో ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బిఆర్‌ఎస్ అఖండ మెజార్టీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర పదవులు అనుభవించిన వారు పార్టీ మారినప్పటికీ కార్యకర్తలు మాత్రం బిఆర్‌ఎస్‌కు కొండంత అండగా ఉన్నారని చెప్పారు. కష్ట సమయంలోనే ఎవరు మనవారు, ఎవరు బయట వాళ్లు అనేది తెలుస్తుందని అన్నారు.

హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసే కుట్ర:

ఓఆర్‌ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని కెటిఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే కుట్రలో బిజెపికి కూడా భాగం ఉందన్నారు. కాంగ్రెస్, బిజెపి ఒక్కటై ఎంపీ ఎన్నికల్లో చెరి ఎనిమిది సీట్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారని, కానీ బిజెపికి బిఆర్‌ఎస్ బీ టీం అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేత్తలు మొదలు పెట్టగానే… ముందుగా ప్రభుత్వానికి మద్దతిచ్చింది బిజెపి నేతలు రఘునందన్, బండి సంజయ్‌లేనని గుర్తు చేశారు. ఈ రెండు పార్టీల చీకటి దోస్తానాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బిజెపికి, కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి డబ్బుల మూటలు పంపిస్తున్నారని ఆరోపించారు. బిజెపితో కలవాల్సిన అవసరం బిఆర్‌ఎస్‌కు లేనే లేదని తేల్చిచెప్పారు. నిత్యం జనంలో ఉండి ప్రజల కష్టాల్లో తోడు ఉండే వారందరికీ అవకాశాలు లభిస్తాయని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News