Saturday, November 16, 2024

పట్టణాలు అభివృద్ధి ఇంజిన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ, రాష్ట్ర ఆర్థిక రంగంలో పట్టణాల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దఎత్తున ఆర్ధిక వనరులు కల్పించడంలో ముందువరసలో ఉంటాయన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణాలు అభివృద్ధి ఇంజన్లుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పట్టణాలు అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నదని వివరించారు. ఇందులో కేవలం స్వల్పకాలిక లక్ష్యలతో కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పట్టణాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పట్టణాల్లో అభివృద్ధి మరింత ప్రణాళికబద్ధంగా జరిగేందుకు చేపట్టే ప్రక్రియ నిరంతరమైనదన్నారు. ఇది ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు, ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాల కనుగుణంగా ముందుకు పోవాల్సి ఉంటుందన్నారు. ఆ దిశగా రాష్ట్ర మున్సిపల్ శాఖ సంసిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పురపాలక శాఖ పరిధిలో ఉన్న వివిధ అంశాలపై గురువారం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణాల అభివృద్ధిపై కూలంకషంగా చర్చించారు. ఆరు గంటలపాటు జరిగిన ఈ విస్తృతస్థాయి మేధోమధన సమావేశంలో పలు అంశాల పైన మున్సిపల్ శాఖ విభాగాల అధిపతులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పట్టణాల ప్రణాళిక రూపొందించే సమయంలో భవిష్యత్ అవసరాలకు సంబంధించి పెద్దపీట వేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి నిపుణులు సూచించారు. గతంలోకన్నా భిన్నంగా పట్టణాల అవసరాలు ఉన్నాయని, దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మేరకు ప్రణాళికలను రూపొందించి ముందుకు పోవాల్సిన అంశాన్ని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పట్టణాలను అభివృద్ధి పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పురపాలిక అయిన హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక మౌలిక వసతుల కార్యక్రమాలను, ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టణాభివృద్ధి, భవిష్యత్ ప్లానింగ్‌కు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులు, చట్టాలను అధ్యయనం చేసేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు. పట్టణ ప్రణాళిక తయారీలో దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన పద్దతుల పైన మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇతర పట్టణ అభివృద్ధి నిపుణులతో ఈ సందర్భంగా ఆయన చర్చించారు. ఇలాంటి విస్తృతమైన మేధోమధన సమావేశాలను నిర్వహించడం ద్వారా అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వివిధ అంశాలపైన ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, వాటన్నింటికీ తాను స్వయంగా హాజరవుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, జలమండలి, డిటిసిపి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

KTR speak on Urban Development

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News