పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలను అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్స్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో పవన్‌కళ్యాణ్, రానా, చిత్ర దర్శకుడు సాగర్ కె.చంద్ర, చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, తమన్, త్రివిక్రమ్, రాధాకృష్ణ, సముద్ర ఖని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ “మంచి మనసున్న మనిషి పవన్‌కళ్యాణ్. విలక్షణమైన వ్యక్తిత్వం ఆయనది. అప్పట్లోనే పవన్ ‘తొలిప్రేమ’ సినిమా చూశాను. ఇక నల్గొండ నుంచి వచ్చిన సాగర్‌చంద్ర ఈ సినిమా ద్వారా పవన్‌ను డైరెక్ట్ చేయడం విశేషం. సిఎం కెసిఆర్ హైదరాబాద్‌ను భారతీయ చలన చిత్ర పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ‘భీమ్లానాయక్’ ద్వారా మొగులయ్య లాంటి కళాకారును ప్రోత్సహించారు ఫిల్మ్‌మేకర్స్”అని అన్నారు. పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో కళాకారులుంటారు. నిజమైన కళాకారులకు కులం, మతం, ప్రాంతాలనేవి ఉండవు. చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు పలువురు పెద్దలు. సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎల్లవేళలా చిత్ర పరిశ్రమకు సహాయసహకారాలను అందిస్తున్నారు. ‘భీమ్లానాయక్’ను ఎంతో బాధ్యతగా చేశాము. మంచి కళాకారులైన మొగులయ్యను ఈ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం జరిగింది. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ చిత్రంలో రానా అద్భుతంగా నటించాడు”అని చెప్పారు.
KTR Speech at Bheemla Nayak Pre Release Event