రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రా అని తిరుగుతుంటే… కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ చోడో అని వదిలి వెళుతున్నాయని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ ను వదిలి వెళుతున్నాయని విమర్శించారు. ఆ కూటమిలో మిగిలేది చివరికి రాహుల్ గాంధీ ఒక్కరేనని.. ఢిల్లీలో మోడీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదన్నారు.శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.
బీజేపీని ఎదుర్కొనే శక్తి లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే చేతులెత్తేసిందని… పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్ లో నితీష్ కుమార్, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరే తెలంగాణలో కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మోడీ అపేది ముమ్మాటికీ బలంగా ఉన్న ప్రాంతీయ లీడర్లే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, వంటి బీజేపీ లీడర్లను ఓడించింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్ లో వినిపించ గలిగేది గులాబీ పార్టీ మాత్రమేనన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ వంటి పార్టీలకు ఓటు వేయాలని.. మోసం కాంగ్రెస్ నైజం… హామీలను ఎగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర మంది అర్హులైన మహిళలకు రెండున్నర వేల రూపాయల మహాలక్ష్మిని పార్లమెంటు ఎన్నికలకు ముందే అందించాలని డిమాండ్ చేశారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్, బీజేపి మంచి అవగాహనతో కలిసి పని చేస్తున్నాయని.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని తిట్టి..అధికారంలోకి రాగానే దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బీజేపీ కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేలా పనిచేసిందని చెప్పారు.