మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే స్వయంగా నోరువిప్పాలని.. గడిచిన తమ పాలనలో హామీలను నిలుపుకోలేక పోయినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటి పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. వారం రోజుల్లో వరంగల్‌కు ప్రధాని మోడీ రాబోతున్న నేపథ్యంలో తాను ఉమ్మడి జిల్లా ప్రజల పక్షనా ఈ డిమాండ్‌ను డైరెక్ట్‌గా ప్రధానికే చేస్తున్నానని స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధ్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులతో పాటు ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లతో కలసి మానుకోట పట్టణంలో పలు అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభనుద్దేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో గుజరాత్ రాష్ట్రానికో న్యాయం.. తెలంగాణ రాష్ట్రానికి మరో న్యాయమా అని ప్రధాని మోడీ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ఫ్యాక్టరీని గుజరాత్ రాష్ట్రానికి తరలించింది నిజం కాదా అని నిలదీశారు. ఖాజీపేటలో ఏర్పాటు చేస్తామన్న కోచ్ ఫ్యాక్టరీని వేల కోట్లతో గుజరాత్‌లో నెలకొల్పి మనకు మాత్రం కేవలం కోచ్‌ల రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనడం ఎంతవరకు న్యాయమో స్పస్టం చేయాలని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటే 360 ఎకరాల స్థలాన్ని కూడా అందించినప్పటికీ ఆ యూనివర్సిటీని మంజూరు చేయడంలో కేంద్ర నాన్చుడు ధోరణీని అవలంబిస్తోందని ఆరోపించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎటుపోయిందో వరంగల్ పర్యటనకు వచ్చే ముందు ప్రధాని మోడీనే సమాధానం చెప్పాలని కెటిఅర్ నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలకే దిక్కులేదని కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు తెలంగాణకు ఏమి చేశారో స్పష్టం చేయాలని కోరారు.
కాంగ్రెసోళ్లు ఆకాశం నుంచి చందమామను కూడా తీసుకువస్తామంటారు జాగ్రత్త..
ఇప్పుడు అధికారంలోకి ఎలాగైనా సరే రావాలన్న కుతుహలంతో ఉన్న కాంగ్రెసోళ్లు ఎడాపెడా వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ఆకాశం నుంచి చందమామను కూడా తీసుకువచ్చి మీ ఇంటి ముందు పెడుతామని కూడా చెబుతున్రు.. ఆ పార్టీ నేతల మాయమాటల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి కెటిఆర్ విజ్ఙప్తి చేశారు. మీరూ అధికారంలో యాబై ఏళ్లకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఉన్నారు. మీరెందుకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయలేక పోయారో ముందు ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. ఇప్పుడు పాదయాత్రలంటూ ఇది బాగ లేదు.. అది బాగ లేదంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.. మీరే అన్ని విధాలుగా అభివృద్ధ్ది చేసి ఉంటే ఆ సమస్యలేవి మీకు కనిపించకుండా పోయేవి కదా అని కాంగ్రెస్ నాయకుల విమర్శలకు తిప్పికొట్టారు. ఇక చాలు మీ మోసాలు.. పేదలను కడుపులో పెట్టుకుని వారి కష్టసుఖాలను కడతేర్చే కెసిఆర్ ప్రభుత్వాన్నే ఆశీర్వదించి మళ్లీ పేదలకోసం కట్టుబడి పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కెటిఆర్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
పోడు రైతులకు పట్టాలు.. రైతు బీమా, బంధు వర్తింపు
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గిరిజనులు అటవీ పోడు భూములకు సిఎం కెసిఆర్ పట్టాలు అందించి వారికి భూ యజమానులుగా చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా గిరిపుత్రులు పండుగ జరుపుకుంటున్న రోజని పేర్కొన్నారు. పోడు పట్టాలు అందించి మమ్మల్ని భూమి యజమానులుగా చేసి రైతుబంధు, రైతు బీమాను వర్తింప చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గిరిజనుల తరుపున కృతజ్ఙతలు తెలుపుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆదివాసి పోరాట యోధుడు కొమురం భీం కోరుకున్నట్లు జల్, జమీన్, జంగల్ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించి రాష్ట్రంలో స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టిన కెసిఆర్ సాహసోపేత నిర్ణయాలను గిరిజనులు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియమకాల ఆధారంగానే నింగికేగిసిందన్నారు. రాష్ట్రం సాధించుకున్నాక సిఎం కెసిఆర్ నేతృత్వంలోనే ప్రాజెక్ట్టు నిర్మాణాలతో సాగునీరు, మిషన్‌భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారని వెల్లడించారు.
మానుకోట పట్టణంలో కాంగ్రెస్ హయాంలో రెండు కోట్ల నిధులు కావాలంటే రెండేళ్లు పట్టేదని.. కానీ కెసిఆర్ మానుకోట పర్యటనకు వచ్చినప్పుడు పట్టణాభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేశారన్నారు. అలాగే జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామ పంచాయతీలకు రూ.పది లక్షల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేశారని స్పష్టం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 26వేల ఉద్యోగాలు ఇస్తే తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఇప్పటికే 1లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఇంకా 80 వేల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతుందన్నారు. అలాగే హరితహారం పేరిట కొత్తగా 5.13 లక్షల ఎకరాల్లో అటవీని విస్తరింపచేశామన్నారు. పోడు చేసుకున్న రైతులకు పట్టాలు ఇవ్వడమేకాక 240 కోట్ల మొక్కలు నాటి అటవీని అభివృద్ధి చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్నాళ్ల పోరాటాలను గుర్తించి తండాలు, గుడాలను గ్రామపంచాయతీలుగా చేసి రూ. 600 కోట్లతో అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలను కూడా నిర్మిస్తున్నామన్నారు. ఆరు శాతంగా ఉన్న ఎస్టీల రిజర్వేషన్లను వారి జనాభాను అనుసరించి పదిశాతానికి పెంచి విద్యా, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చామన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా అటవీభూములకు పట్టాలను అందించి వారికి రైతు బంధు, బీమా కూడా వర్తింప చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. గుండెపైచేయి వేసుకుని చెప్పండి మీ పరిపాలనలో ఇన్ని పథకాలు సృష్టించి పేదలకు మేలు చేశారో వివరించాలని విపక్షలను ప్రశ్నించారు. అన్ని గ్రామపంచాయతీల్లో రోడ్ల సౌకర్యం మెరుగు పండింది.. త్రీఫెస్ కరెంట్ తండాలు, గూడాలకు అందిస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఊహకందని అభివృద్ధి జరుగుతుంది
జిల్లాలు ఏర్పాటు చేసి ఎక్కడో ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మీ వద్దకే చేర్చి పరిపాలనను ప్రజల దరి చేర్చింది మేము కాదా అని నిలదీశారు. ఊహకందని విధంగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేస్తూ ఇక్కడ మెడికల్, నర్సింగ్, గురుకుల ఇంజనీరింగ్‌కళాశాలలు ఏర్పాటు చేసి విద్యా, వైద్యపరంగా ఈ ప్రాంతంలో అధికంగా ఉండే గిరిజనులకు మేలు కలుగచేసినట్లు మంత్రి కెటిఆర్ వివరించారు. నేనురాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే నానుడి పోయి ప్రభుత్వ ఆస్పత్రికి పోయి కాన్పులు చేయించుకుంటూ కెసిఆర్ కిట్లు పొందుతూ అనేక మంది పేద, మధ్య తరగతికి చెందిన వారు ప్రయోజనం కలుగ చేయడం చూస్తే కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న విశ్వాసమే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తొలుత తెలంగాణ కళాకారుడు సాయిచంద్ చిత్రపటానికి పూల మాలలేసి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
సభలో పోడు రైతులకు హక్కుపత్రాలు అందించి రైతు బంధు, రైతు బీమా వర్తింప చేసే ప్రక్రియను కూడా మంత్రి కెటిఆర్ చేతులమీదుగా చేపట్టారు. ఇంకా కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు,ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక తదితరులు ప్రసంగించారు. సభలో శాసనమండలి ఉపాద్యక్షులు డాక్టర్ బండా ప్రకాశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, హరిప్రియనాయక్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, తక్కెళ్లపలి రవీందర్‌రావు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, రైతు విమోచన సమితి రాష్ట్ర అద్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మైన్లు అంగోతు బిందు, గండ్రజ్యోతి, నెడ్‌క్యాప్ చైర్మైన్ సతీష్‌రెడ్డి,బడే నాగజ్యోతి, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, బాలోజీనాయక్, బీఆర్‌ఎస్ నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాసరెడ్డి, మర్రి రంగారావు, మూల మధుకర్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కుడితి మహేందర్‌రెడ్డి, ముత్యం వెంకన్న, కేఎస్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.