అన్నిరకాల అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా
మూడు నెలకొకసారి వస్తా.. బిజెపి, కాంగ్రెస్ మాటలువిని ఆగం కావొద్దు
కమలానికి ఓటేస్తే చేనేతపై జిఎస్‌టి 12% పెరుగుతుంది
కూసుకుంట్ల నామినేషన్ ర్యాలీలో కెటిఆర్
బంగారుగడ్డ నుంచి చండూరు వరకు భారీగా తరలివచ్చిన జనం
రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంతో సమానంగా మునుగోడును అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పూర్తిగా తానే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గం ప్రజలు బాగా ఆలోచించి ఓటుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మద్దతు లభించే టిఆర్‌ఎస్‌కు ఓటేస్తారో? లేక స్వార్థ్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికను తీసుకొచ్చిన వారికి మద్దతు ఇస్తారో తేల్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాతనే మునుగోడులో ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికను ఎవరు కోరుకోలేదన్నారు. కేవలం ఒక వ్యక్తి ధనదాహం కోసం వచ్చిన ఎన్నిక అని అన్నారు. అలాంటి వ్యక్తికి నియోజకవర్గం ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. అప్పుడే భవిష్యత్తులో అలాంటి నేతలకు భ యపడే పరిస్థితి వస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కొందురు జుమ్లా మాటలు చెబుతుంటారన్నారు. వారి మాటలను విశ్వసించి ఆగం కావొద్దన్నారు. టిఆర్‌ఎస్ మన ఇంటి పార్టీ అని అన్నారు. అందుకే టిఆర్‌ఎస్‌ను గెలిపించి… మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
మూడు నెలకు ఒకసారి వస్తా!
ఎన్నికలు ముగిసిన వెంటనే (నవంబర్ ఆరు) ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిస్థాయిలో అండగా ఉంటానని అన్నారు. రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని అన్నారు. తనపై విశ్వాసం ఉంచండని ఓట్లర్లకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తానని అన్నారు.
వాళ్లు రిజర్వాయర్లు కట్టలేదు…తాగు నీరు ఇవ్వలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ జిల్లాకు అనుకొని కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ తాగు సాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. వాళ్లు రిజర్వాయర్లు కట్టలేదు… తాగునీరు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ కట్టి రెండున్నర లక్షలకు నీరు ఇవ్వబోతున్నదన్నారు. ఇప్పటికే లక్ష్మణపల్లి రిజర్వాయర్‌ను చేపట్టామన్నారు. పలు చెరువులను నింపుతున్నామని కెటిఆర్ వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సిఎం కెసిఆర్ సంపూర్ణ అవగాహన ఉందన్నారు. అందుకే ఆయన మునుగోడు ప్రజల కష్టం బాగా తెలుసన్నారు. ఈ నేపథ్యంలో ఆయన 2006లో 32 మండలాలు తిరుగుతూ స్వయంగా పాట రాశారన్నారు. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాట రాసిండన్నారు. అప్పట్లో శివన్నగూడెంలో నిద్రించిన సమయంలోనే ఒక మాట ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని చెప్పి…. ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు.
ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం కల్పించాం
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత విముక్తి కల్పించామని కెటిఆర్ అన్నారు. ప్రధానులు పట్టించుకోని సమస్యను కూడా కెసిఆర్ పరిష్కరించారన్నారు. ఫోరోసిస్ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో 1996లో జరిగిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 400 మంది నామినేషన్లు వేశారన్నారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. కానీ మిషన్ భగీరథ ద్వారా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నీరు అందించి ఫ్లోరోసెస్‌ను భూతాన్ని తరిమికొట్టామన్నారు. ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనత కాదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో లక్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుందన్నారు. 10 ఏండ్లకు ముందు మునుగోడు ఎలా ఉండే….ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. ఒకప్పుడు రాత్రి సమయాల్లో బావుల వద్దకు వెళ్లి మోటార్లు వేసుకునే వాళ్లమని…కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉమ్మడి ఎపీలో విత్తనాలు పోలీసు స్టేషన్‌లో పెట్టి ఇచ్చేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవి కూడా కల్తీ విత్తనాలేనని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా అమలు చేస్తున్నామన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా వారం రోజుల్లో రూ .5 లక్షలు రైతుబీమా ఇస్తున్నామన్నారు. తాగు, సాగునీటితో పాటు కరెంట్ సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు.
ప్రజలపై రుద్దిన బలవతంపు ఎన్నిక
నాలుగేండ్ల పాటు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. అందులో ఓట్లను కొనుగోలు చేయడానికి ఆయన కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్నారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొట్టాను అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరినందుకు మోడీ తనకు రూ18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండని ఆయనే చెబుతాడని… మళ్లీ మాట మార్చి… మాది చిన్న కంపెనీ అని అంటాడన్నారు. మిషన్ భగీరథకు రూ19 వేల కోట్లు ఇవ్వాలంటే మోడీ ఇవ్వరు కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను అప్పనంగా రాజగోపాల్ రెడ్డికి ఎలా కట్టబెట్టారని నిలదీశారు. అందువల్లే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికగా కెటిఆర్ అభివర్ణించారు. అందుకే మునుగోడుకు అవసరం లేని ఎన్నిక.. బలవంతంగా మీ మీద రుద్దబడుతున్న ఎన్నిక అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
చేనేతకు మరణశాసనం రాసిన మోడీ
చేనేత రంగానికి మోడీ మరణ శాసనం రాశారని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి ఎవరకు ఏ ప్రధాని కూడా చేతనేపై పన్ను విధించ లేదన్నారు. కానీ ఈ దుర్మార్గపు మోడీ మాత్రం 5 శాతం జిఎస్‌టి విధించారని మండిపడ్డారు. దీని ప్రభావం చేనేత రంగంపై తీవ్ర స్థాయిలో పడనుందన్నారు. త్వరలోనే చేనేత బంద్ అయిపోయే రోజును మోడీ తీసుకరానున్నారన్నారు. ఇప్పటికే ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశాడన్నారు. నేతన్నకు ఇచ్చే బీమా పథకాన్ని కూడా మోడీ ఎత్తేశాడని కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చేనేత రంగంపై కేంద్రం కక్షసాధిస్తుంటే…..మన రాష్ట్రంలో మాత్రం చేనేత మిత్ర పేరుతో సిఎం కెసిఆర్ 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారన్నారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ మస్త్ మాటలు చెప్పిండని ఎద్దేవా చేశారు. జనధన్ ఖాతాలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు వేస్తా అని చెప్పాడన్నారు. మరి ఎవరికైనా రూ. 15 లక్షలు వస్తే వాళ్లు బిజెపికి ఓటు వేసుకోవచ్చునని అన్నారు. ఇక ఉద్యోగాల గురించి అడిగితే చాయ్ బండి…. మిర్చి బండి… పకోడి బండి పెట్టుకోమని చెబుతున్నాడని మోడీపై తనదైన శైలిలో కెటిఆర్ సైటర్లు వేశారు. ఇంకా ఏమైనా అంటే మేం హిందువులం అని చెప్పుకుంచారని మండిపడ్డారు. హిందువులంటే ఒక్క బిజెపియేనా? అని ప్రశ్నించారు. మిగిలిన పార్టీల్లో హిందువులు లేరా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఆ పార్టీ ఎన్నికలప్పుడు హిందునినాదాన్ని ఎత్తుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశమే అబ్బురపడే విధంగా యాదాద్రి నిర్మాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిందన్నారు. ఆ నిర్మాణానికి కేంద్రం ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. అంటే ఓట్ల కోసం హిందువులపై ఎనలేని ప్రేమ ఉన్నట్లుగా మోడీ ప్రభుత్వం నడిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇవన్నీ అడిగితే హిందుస్తాన్… పాకిస్తాన్ అని మత గొడవలు పెట్టేందుకు యత్నిస్తారని విమర్శించారు. మీ కలలను నిజం చేస్తుంది కెసిఆర్ కాదా? తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తుంది టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. మంచి ఏదో… చెడు ఏదో ఆలోచించుకుని ఓటు వేయాలని కెటిఆర్ సూచించారు.
సాగునీటి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్న కేంద్రం
సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అడ్డం పడుతుందని కెటిఆర్ అన్నరు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదన్నారు. అందులో ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 811 టిఎంసిల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు రావాల్సిన 575 టిఎంసిల నీటిని ఇవ్వాలని కోరితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. నీళ్లలో వాటా తేల్చకుండా చావగొడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌కు మంచి పేరు రాకుండా మోడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు.
ఆగమాగం మాటలు చెబుతున్నారు
ఎన్నికలు రాగానే కొందరు ఆగమాగం మాటలు చెబుతున్నారని కెటిఆర్ విమర్శించారు. మునుగోడులో బిజెపి గెలిస్తే ఈ నియోజకవర్గానికి రూ.1000 కోట్లు ఇస్తానని అమిత్ షా చెప్పిండని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. ఉపఎన్నిక వచ్చిన చోటల్లా ఇదే మాట చెబుతారన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. పచ్చి మోసగాళ్లు బిజెపి నాయకులని మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రైతన్న గీతన్న నేతన్న కోసం పని చేసే నాయకుడిని గెలిపించుకుందామన్నారు.
6వ తేదీ తరువాత తానే స్వయంగా పట్టాలిస్తా
ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి కోరిన విధంగా చండూరులో భూములు కోల్పోయిన 431 మంది నిర్వాసితులు ఇంటి జాగాకు స్థలాలు ఇస్తామని కెటిఆర్ హామి ఇచ్చారు. నవంబర్ 6వ తేదీ తరువాత తానే స్వయంగా ఇక్కడకు వచ్చిన పట్టాలిస్తానని అన్నారు. ఇది మీప్రభుత్వం… మన ప్రభుత్వం… కెసిఆర్ ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొట్ట మొదటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారిని గుండెల్లో పెట్టుకుని చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులకు ఇండ్ల పట్టాలిచ్చే బాధ్యత తనదేనని కెటిఆర్ అన్నారు.
KTR Speech at Election Campaign in Munugode