భారతదేశానికి తెలంగాణ మోడల్ కావాలి : మంత్రి కెటిఆర్
తొమ్మిదేళ్లలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా మారింది
సరైన ప్రణాళిక, అంకితభావంతో పనిచేస్తే 20 ఏళ్లలో భారతదేశం తలసరి ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు పెంచవచ్చు
ప్రపపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఇండియా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు
లండన్‌లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఉద్వేగంగా వివరించిన మంత్రి
బ్రిడ్జ్ ఇండియాతో కలిసి ఇపిజి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలను సాధించడంతోనే అనతికాలంలో తెలంగాణ ప్రగతి సాధ్యమైందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ మోడల్‌ను అనుసరిస్తే ఇండియాకు తిరుగు ఉండదని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న మంత్రి కెటిఆర్, లండన్‌లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో పాల్గొని తొమ్మిదేండ్ల తెలంగాణ విజయగాథను ఉద్వేగభరితంగా వివరించారు. ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చేకునేలా యువతను తయారుచేసినప్పుడే మనదేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కెటిఆర్ అన్నారు.
భారతదేశానికి అనేక సహజ అనుకూలతలు ఉన్నాయి. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు, ఖనిజాలతో పాటు తగినంత కరెంటును ఉత్పత్తి చేయడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. దేశంలో ఉన్న నదులు, సరస్సులు, నీటి వనరులతో వ్యవసాయ భూములకు కావాల్సినంత సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలందరికి తాగునీరు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నీళ్లు సరఫరా చేయవచ్చు. వీటన్నింటికన్న ముఖ్యంగా సాటిలేని మానవ వనరులు మనదేశంలో ఉన్నాయని అని మంత్రి వివరించారు.
మానవ జాతి చరిత్రలో ఇప్పటివరకు ఏ దేశానికి లభించని గొప్ప అవకాశం మనదేశానికి మాత్రమే దొరికిందని కెటిఆర్ అన్నారు. దేశ జనాభాలో 67 శాతం మంది పనిచేసే వయసు వారే అన్నారని చెప్పారు. జనాభాలో అత్యధికంగా ఉన్న యువత శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన కార్యచరణను అమలుచేస్తే 30 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని, 20 ఏళ్లలోపే ఇండియా సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సౄష్టించేలా యువతకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఉపాధి, వ్యవస్థాపకత రంగాల్లో అనేక అవకాశాలను వారికి అందించాలని మంత్రి కెటిఆర్ అన్నారు.
ఇప్పుడు తెలంగాణ పచ్చని రాష్ట్రంగా మారింది
భారతదేశ విజయవంత స్టార్టప్ రాష్ట్రం-తెలంగాణ విజయగాథను మంత్రి వివరించారు. కేవలం తొమ్మిదేళ్లలోనే విప్లవాత్మక ప్రగతితో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడంతోనే ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పును సాధించామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన విధానంతో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలకు నాంది పలికిన తీరును మంత్రి కెటిఆర్ వివరించారు.ఒకప్పుడు తెలంగాణను ఎడారి ప్రాంతంగా భావించేవారని, గ్రామాల్లోని సరస్సులు, ట్యాంకులు ఎండిపోయి సాగు కోసం రైతులు అనేక బోరు బావులు తవ్వారని, ఆర్థిక భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని చెప్పారు. తాగడానికి మంచినీళ్లు లేక కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఫ్లోరోసిస్‌తో బాధపడేవారని, కానీ ఇప్పుడు తెలంగాణ పచ్చని రాష్ట్రంగా మారిందని తెలిపారు. ఇక్కడ ఒక రైతు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాడని, సాగునీరు, రైతు సంక్షేమం, ఇతర సంస్కరణల్లో బిఆర్‌ఎస్ చేసిన పనులతోనే తెలంగాణ ఐదు విప్లవాలకు నాంది పలికిందని అని మంత్రి కెటిఆర్ చెప్పారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ
విద్యుత్, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాలలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్న విధానాలు, ప్రత్యేక పథకాలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయా రంగాల్లో సాధించిన విజయాలను ఎత్తిచూపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ఉందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మన తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగిందన్నారు. 2.5 శాతం జనాభా ఉన్న రాష్ట్రం భారతదేశ జిడిపిలో 5 శాతానికి దోహదం చేస్తుందన్నారు.
అంత్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీలకు నిలయంగా హైదరాబాద్
అంత్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయమని కెటిఆర్ పేర్కొన్నారు. వినూత్న ఆవిష్కరణలకు కేంద్రమని చెప్పారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్‌తో పాటు భారతదేశపు అతిపెద్ద నమూనా కేంద్రం టి-వర్క్స్, భారతదేశపు మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్త ఇంక్యుబేటర్ వి – హబ్, గ్రామీణ ఆవిష్కర్తలకు సహాయం చేయడానికి టిఎస్‌ఐసి, యువతకు దిశానిర్దేశం చేసే అతిపెద్ద శిక్షణా కేంద్ర టాస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఏర్పాటుచేస్తున్నప్పటికీ పర్యావరణం పట్ల ఉన్న నిబద్ధతను మాత్రం కోల్పోలేదని అన్నారు. మానవ చరిత్రలో అతిపెద్ద హరిత కార్యక్రమాలలో ఒకటైన హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, 24 బిలియన్ల మొక్కలు నాటామని చెప్పారు.
ఒక రాష్ట్రంగా, తాము భారతదేశంలో అత్యధిక గ్రీన్ కవర్ వృద్ధిని 7 శాతం సాధించామని కెటిఆర్ అన్నారు. సమయం వచ్చిందనే ఆలోచన కంటే శక్తివంతం ఏదీ లేదని ఫ్రంచ్ రచయిత విక్టర్ హ్యూగో ఫేమస్ కొటేషన్‌ను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. తెలంగాణ మోడల్ సమయం వచ్చిందన్నారు. తెలంగాణా మాదిరిగానే భారతదేశంలోని వ్యవస్థాగత సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. నూతనోత్సాహంతో కూడిన భవిష్యత్తును సృష్టిస్తూ, నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతూనే రైతు, యువతపై దృష్టి సారించాలని మంతి కెటిఆర్ అన్నారు. సరైన ప్రణాళిక, అంకితభావంతో పనిచేస్తే వచ్చే 20 ఏళ్లలో భారతదేశం తలసరి ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు పెంచవచ్చని కెటిఆర్ అన్నారు. ప్రపపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఇండియా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.