Thursday, January 23, 2025

మోడీని ‘బండ’కేసి కొట్టండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను మోడీ 400సార్లు తిట్టాడని, మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200 చేసిన మోడీని ఆడబిడ్డలు అందరూ కలిసి మోడీని బండకేసి కొట్టాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర కళాశాల ఆవరణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ ఇటు బిజెపిపైన అటు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతమని, జనహితమే మన అభిమతం అన్న దృక్పథంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలనందరిని కడుపున పెట్టుకొని చూసుకుంటున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. పల్లె పల్లెన పల్లేరు మెలిసే పాలమూరులోనా, సేతానం ఏడుందిరా సేలన్నీ బీడాయరా.

నెర్రెల బారిన నేలలు, నెత్తురు పారిన నేలలు అంటూ ఆనాడు పాలమూరు దుస్థితిపై కవుల పాటలు రాసేవాళ్లలన్నారు. తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలో ఏం మారింది అంటే ఆనాడు పాలమూరు అంటే వలసలు ఈ నాడు పాలమూరు అంటే ఇరిగేషన్ అని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ నీళ్లు లేని దుస్థితి లేదన్నారు. లేబర్ పనుల కోసం ఒక నాడు పొట్ట చేత బట్టుకొని దేశంలో ఎక్కడికెక్కడో పాలమూరు కూలీలు వ లస పోయేవాళ్లు, కానీ ఇవాళ ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడి వ చ్చి పనులు చేస్తున్నారంటే ఇది పాలమూరు ప్రగతి కాదా అని కెటిఆర్ నిలదీశారు. అనాడు ఉన్న బీడు భూములు ఇవాళ మా గాణాలు అవుతున్నాయని, పాలమూరులో పంట రాశులు పండుతున్నాయన్నారు. నాడు ఎక్కడ చూసినా కరువు, కన్నీళ్లు ఉంటే ఇవాళ ఎక్కడ చూసినా చెరువులు, నీళ్లు, ఎర్రటి ఎం డల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. కె అంటే కా ల్వలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు కలిపితేనే కెసిఆర్ అని అన్నారు.

బిఆర్‌ఎస్ భారత రాష్ట్ర సమితే కాదని, భారత రైతు సమితని కూడా అయన చెప్పారు. తెచ్చుకున్న తెలంగాణ ఎంత బాగుందో అని చెప్పడానికి పాలమూరే సాక్షమని అన్నారు. కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పది లక్షల ఎకరాలకు వచ్చే ఆగస్టులో నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కెటిఆర్ స్పష్టం చేశారు. బాబాసాహెచ్ అంబేద్కర్ సచివాలయంలో అడుగు పెట్టిన మొదటి రోజే పాలమూరు రంగారెడ్డి పథకం మీద సమీక్ష చేసి మహబూబ్‌నగర్‌పై తనకున్న ప్రేమను ముఖ్యమంత్రి కెసిఆర్ చాటుకున్నారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షల మంది రైతులకు 10 కిస్తుల్లో రూ. 1900 కోట్లు రైతుబంధు కిం ద ఇచ్చామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో 36 53 మంది కుటుంబాలకు రైతు బీమాతో రూ. 182 కో ట్లు పంపిణీ చేశామని చెప్పారు. కాంగ్రెస్,బిజెపి పాలనలోని రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఇచ్చారా ఈ సన్యాసులు అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ వయస్సు, స్థా యిని గౌరవించాలన్న సంస్కారం లేని వాడు రేవంత్‌రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. 55 ఏళ్ల దేశాన్ని పాలించింది కాంగ్రెస్సేనని, 11 చాన్సులు ఇచ్చినప్పడు ఏమి చే శారని నిలదీశారు.

కరెంటు, మంచినీళ్లు, సాగునీరు ఇవ్వలేని అసమర్థతకు తాము బాధ్యత కాదన్నట్లు కాం గ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్కగా పని చేసి ఉంటే తెలంగాణాలో నేడు సమస్యలు ఉండేవి కావని 55 ఏళ్లలో కాం గ్రెస్ తెచ్చిన దారిద్రాన్ని 8 ఏళ్లలోనే తొలగించమంటున్నారని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని మంచోడు అనాలో, పిచ్చోడు అనాలో తెలియడం లేదన్నారు. 2014లో ప్రధాని మోడీ జనధన్ ఖాతాలు తెరిస్తే రూ. 15 లక్షలు ఇస్తమన్నాడని, కాని ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని దుయ్యబట్టారు. 15 లక్షలు ఇస్తామన్న మోడీ ఒక దిక్కు, 15 లక్షల మంది పిల్లలను వలసలు పోకుండా ఆపిన కెసిఆర్ పెద్ద దిక్కుగా నిలిచారన్నారు. కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను పంచేందుకు కూడా మోడీకి టైం లేదని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని బిజెపి నేతలు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మోసం చేసిన మోడీని దేవుడు అని బండి సంజయ్ అంటున్నాడని, కానీ అదానీకి మాత్రమే మోడీ దేవుడన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 603 ప్లేసులో ఉన్న అదాని మోడీ పుణ్యమా అని నెంబర్2 ప్లేస్‌కు వచ్చిండని చెప్పారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేయని మోడీ, అదానీ ఆదాయాన్ని లక్ష రెట్లు పెంచాడని ఆరోపించారు. అదానీ సంపాదన నుంచి బిజెపి చందాలు తీసుకొని అడ్డమైన దారులు తొక్కుతుందని కెటిఆర్ ఆరోపించారు. కర్నాటక, మహారాష్ట్రాలో ఎంఎల్‌ఎను కొని పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బిజెపిపై మండిపడ్డారు. గుజరాత్ వాళ్ల చెప్పులు మోసే గుజరాతీ గులాములు ఇవాళ రాష్ట్ర బిజెపిలో ఉన్నారని విమర్శించారు.

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహల్ చోస్కి లాంటి బ్యాంకు ఎగవేతదారుల పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన మోడీ కావాలా ? 14 లక్షల మంది పేద ఆడపిల్లలకు పెండ్లిం డ్లు చేసిన మేనమామ కెసిఆర్ కావాల్నో పాలమూరు ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణం అద్భుతంగా అభివృ ద్ధ్ది చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్, జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ , టీఎస్‌ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ న ర్సింహారెడ్డి, మాజీ మంత్రి డా. సి. లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి,జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, గోరేటి వెంకన్న, కశిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News