హైదరాబాద్: భాగ్యనగరం సిగలో మరో మణిహారం చేరింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. షేక్ పేట్ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలోనే రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఎస్.ఆర్.డి.పి ద్వారా ఫ్లైఓవర్ల నిర్మిస్తున్నామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కంటోన్మెంట్‌లో 21 రోడ్లను మూసివేశారని, వాటిని తెరిపించేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. స్కైవేల నిర్మాణానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయలని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు జాతీయ రహదారులు వచ్చాయని తెలిపారు. సైన్స్ సిటీ కోసం స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాశానని చెప్పారు.
కాగా, మొత్తం రూ.333 కోట్లతో 2.7 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ షేక్ పేట్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా మెహదీపట్నం – హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
KTR Speech at Shaikpet flyover inaugurated
- Advertisement -