సిరిసిల్ల : రాజకీయాలలో అధికారం రావడం, పోవడం సహజమని కార్యకర్తలు బాధ, భయ పడవద్దని బాధ్యత గల ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా పనిచేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం సిరిసిల్లకు నూతన శాసన సభ్యునిగా ఎన్నికై మొదటిసారి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌కు రాగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మా ట్లాడారు. సిరిసిల్ల ప్రజలకు ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా వాటికి లొంగకుం డా అభివృధ్ధి సంక్షేమానికి పట్టం కట్టారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తాను ఓటుకు మందు పోయనని, రూపాయి ఇవ్వనని చెప్పినా తనను 30వేల ఓట్ల ఆధిక్యంతో ఆదరించినందుకు సిరిసిల్ల ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలో ఒక్కోసారి వస్తాయని, అది సహజమని అందువల్ల కార్యకర్తలు నిరాశ, బాధ, భయ పడవద్దన్నారు.
రెండు లక్షల రుణమాఫీ, అందరికీ ఇంల్లు, ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయాలని అందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసిన వారిలో అనేకమంది తమకు అయ్యో కెసిఆర్ ప్రభుత్వం పోయిందా అంటూ మెసేజ్‌లు పెడుతున్నారన్నారు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ బిఆర్‌ఎస్ అని తమకు పోరాటాలు కొత్తకాదన్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రజల సమస్యలను వారి గొంతుకగా వినిపిస్తామన్నారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకరని, స్వల్పకాలం మాత్రమే ఉంటుందని ప్రజలు అన్నీ గమనిస్తారని తిరిగి అనతి కాలంలోనే ప్రజల విశ్వాసం పొందుతామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. వేములవాడలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో సీటు కోల్పోయామన్నారు. సిరిసిల్ల అభివృధ్ధి కోసం నిరంతరం పోరాటం సాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిసి పి.అరుణ, సిరిసిల్ల మున్సిపల్ సిపి జిందం కళచక్రపాణి, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.