శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కఠినంగా ఉంటారు
వామన్‌రావు దంపతుల హత్య దురదుష్టకరం, బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడుతుంది
న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?
తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రోటక్షన్ యాక్ట్ కోసం కృషి చేస్తామని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. దేశంలో ఇలాంటి చట్టం ఎక్కడైనా ఉందా? లేదా? అనేది పరిశీలన చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకపోతామన్నారు. శాంతి భద్రతల విషయంలో సిఎం చాలా కఠినంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఎవరిని ఉపేక్షించబోమన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్నదే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్షమన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఈ ఘటనపై అందరం చాలా బాధపడ్డామన్నారు. ఈ హత్యకేసులో టిఆర్ఎస్కు చెందిన ఒక నేత ఉన్నారనే ఆరోపణలు రావడంతో వెంటనే అతనిని పార్టీని తొలగించామన్నారు. వామన్‌రావు దంపతుల హత్యకు కుట్ర పన్నిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్ష పడుతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమైనది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్తో పాటు న్యాయవాదులు చేసిన ఆందోళనలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయని కెటిఆర్ అన్నారు. ఈ విషయంలో న్యాయవాదులు ఇచ్చిన సపోర్టును టిఆర్ఎస్ పార్టీ ఎన్నటికి మరిచిపోదన్నారు. రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇందిరా పార్కు దగ్గర లాయర్ల నిరసనలు తాను మరిచిపోలేదన్నారు. విద్యార్థులకు దీటుగా లాఠీ దెబ్బలు తిన్న సంఘటనలు ఇంకా మదిలో ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ పోస్టు ఇవ్వడానికి అప్పటి నేతలు ముందుకు రాలేదన్నారు. మొదటి తెలంగాణ ఎజీగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ప్రారంభమైందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో సగటు మనిషికి లాభం జరిగిందా? లేదా? నష్టం జరిగిందా? అనేది లాయర్లు ఆలోచన చేయాలన్నారు.
న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క పని అయినా చెప్పగలరా?
న్యాయవాదుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క మంచిపనిని అయినా బిజెపి నాయకులు చెప్పగలరా? అని కెటిఆర్ సవాల్ విసిరారు. కేవలం ఆ పార్టీ నేతలు మాటలు చెప్పి బతుకున్నారే తప్ప న్యాయవాదుల సంక్షేమానికి చేసింది శూన్యమని విమర్శించారు. న్యాయవాదుల కోసం రూ. 10వేల కోట్ల నిధులను మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజనపై బిజెపి ఎంఎల్‌సి సిట్టింగ్ అభ్యర్ధి రామచందర్ రావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. న్యాయవాదుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించి రామచందర్ రావు ఓట్లు అడగాలని మంత్రి కెటిఆర్ సూచించారు.
వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. డీజిల్- పెట్రోల్ ధరల పెరుగుదలపై అప్పట్లో కాంగ్రెస్‌ను తిట్టిన మోడీ ఇవ్వాళ దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కెటిఆర్ నిలదీశారు. దేశంలో ప్రధానప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్‌కు తగు సంఖ్య లేకపోవడంతోనే బిజెపి ఆటలు సాగుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ గత చరిత్ర తప్ప భవిష్యత్ లేదు
కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర తప్ప భవిష్యత్ లేదని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతం నుంచి సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన పివి నరసింహారావును ఆ పార్టీ అడగుడుగునా అవమానించిందని మండిపడ్డారు. ఆయన చనిపోయినప్పుడు కనీసం భౌతికకాయం పూర్తిగా కాలకముందే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ జారుకున్నారని విమర్శించారు. ఆయనను కాంగ్రెస్ ఏనాడు పట్టించుకున్న దాఖలాలు టిఆర్ఎస్ హయంలో ఉద్యోగులు, నిరుద్యోగులకు అసంతృప్తి ఉన్నట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌తో పాటు లీగల్ సెల్‌కు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
KTR Speech at TRS Legal Cell meeting in Telangana bhavan