ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రాస్టక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్
ఈ మూడింటితో నయా భారత్‌ను కొత్త తరానికి
అందించవచ్చని ప్రధాని మోడీకి చెప్పా
కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
నాడు బెంగాల్‌ను అనుసరించారు.. నేడు తెలంగాణ ఆలోచనే దేశం ఆలోచనగా మారింది
విప్లవాత్మక సంస్కరణలతో అధికారుల గుప్పెట్లోని అధికారాన్ని కెసిఆర్ ప్రజలకు అందించారు
అవినీతిని పెకలించారు.. ధరణిని ఏర్పాటు చేశారు
త్వరలోనే సమగ్ర భూ సర్వే : పార్టీ ప్లీనరీలో టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘త్రీ ఐ’ అంటే ఇన్నోవేషన్,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,ఇన్‌క్లూసివ్ గ్రోత్ అని, ఈ మూడింటిని దేశవ్యాప్తంగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా నయా భారత్‌ను కొత్త తరానికి అందివచ్చని ప్రధాని మోదీకి చెప్పినట్లు టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్, ఐటి, పరిశ్రమల కె.తారకరామారావు అన్నారు. సోమవారం హైటెక్స్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో ‘పరిపాలన సంస్కరణలు, విద్యుత్ రంగాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటి రంగం అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన’ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ‘త్రీ ఐ’ తో నడుస్తుందన్నారు. సమగ్ర కుటుంబసర్వే దేశ చరిత్రలోనే సంచలనం అన్నారు.సమగ్ర కుటుంబ సర్వేతో సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లగలిగామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి.. అక్షాంశాలు, రేఖాంశాలతో భూములను గుర్తించి పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్, యాపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్. ఫేస్‌బుక్ ఫస్ట్ ఫేవరేట్ డెస్టినేషన్ హైదరాబాద్. ఐటీ అంటే ఇన్‌క్రెడిబుల్ తెలంగాణ. దేశంలోనే అతిగొప్ప స్టార్టప్‌గా రాష్ట్రం అవతరించిందన్నారు.
నాడు బెంగాల్‌ను అనుసరించారు.. నేడు తెలంగాణ ఆలోచనలే...
బెంగాల్ ఆలోచించేది దేశం మొత్తం ఆలోచిస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు తెలంగాణ ఆలోచించేదే దేశం ఆలోచిస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారు. ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారు. టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదు. ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం. నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శమైంది. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి హైదరాబాద్ బ్యాకప్ మాత్రమే. ఇవాళ ఐటీకి హైదరాబాద్ బ్యాక్ జోన్ అయింది” అన్నారు.
విప్లవాత్మక సంస్కరణలు.. సువర్ణ అధ్యాయాలు..
ఏడేళ్లల్లో పలు పరిపాలన సంస్కరణలు రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అమలు చేశారని మంత్రి కెటిఆర్ గుర్తుచేశారు. అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదలు, బలహీన వర్గాలకు అందించడంతో పాటు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడమే సంస్కరణ ఉద్దేశమన్నారు. ‘సమగ్ర కుటుంబ సర్వే’తో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. భూ రికార్డుల సంస్కరణలో భాగంగా ధరణి ఏర్పాటు చేశారు.అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో 33 జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను పెంచినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ గ్రామం అంటే.. గంగదేవిపల్లె పేరు చెప్పేవారని.. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు, విధులతో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా కేంద్రప్రభుత్వం స్వయంగా గుర్తించి, అవార్డులు అందజేస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టంతో కడిగేసే బ్రహ్మాస్త్రంగా తీసుకువచ్చారన్నారు. పల్లెలు, పట్టణాల ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకు అదనపు కలెక్టర్లను నియమించామని గుర్తుచేశారు.
శాంతిభద్రతలకు ప్రాధాన్యం..
శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు. తొమ్మిది కమిషనరేట్లతో. దేశంలోనే లా అండ్ ఆర్డర్‌లో తెలంగాణ ‘ఫస్ట్ ఇన్ సేఫ్టీ.. బెస్ట్ ఇన్ సెక్యూరిటీ’ అనే విధంగా గొప్ప పేరుతెచ్చుకుంటుందన్నారు. కట్టుకథలు.. పిట్టకథలు చెబితే పరిశ్రమలు రావన్నారు. మౌలిక వసతులను కల్పించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన సదుపాయలను కల్పించడంతోనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. నగరంతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో ఐటి హబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ స్టార్టప్ వేదిక కాగా… కేంద్రం ఫ్యాకప్‌లకు అండగా మారిందన్నారు. యువ, నవ తెలంగాణగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు.
సాగునీటి వనరులను ఒకే గొడుగు కిందికి..
చిన్ననీటి వనరులను.. బహుళ సాగునీటి ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు ముఖ్యమంత్రి కెసిఆర్ తెచ్చారు. సాగునీటి ముఖచిత్రాన్ని మార్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. కెసిఆర్ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని రైతులు వ్యక్తం చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాష్ట్రాన్ని 19 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి చీఫ్ ఇంజనీర్లను నియమించాం. నీళ్లు.. నిధులు.. నియామకాల భాగంగా యువత ఆకాంక్షలను గుర్తించి నూతన జోనల్ వ్యవస్థను తెచ్చాం. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం తెచ్చిందన్నారు.
నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదు.. : మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
తెలంగాణ చీకట్లను పారదోలి వెలుగులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో మంల్రి కెటిఆర్ ప్రవేశపెట్టిన ‘పరిపాలన సంస్కరణలు, విద్యుత్ రంగాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటి రంగం అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన’ తీర్మానాన్ని ఆయన బలపర్చగా.. సమావేశంలో పాల్గొన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేళ్లుగా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఘనత టిఆర్‌ఎస్‌దేనని గుర్తుచేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరాయన్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు పలు పథకాలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదని.. ప్రశ్నించేందుకు సైతం ప్రతిపక్షం ముందుకు రావడం లేదని ఎద్దేవ చేశారు.
KTR Speech at TRS Plenary