Friday, January 24, 2025

కాళేశ్వరం.. జయకేతనం

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు
కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్‌గా గుర్తించి అవార్డు ఇచ్చిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్
అవార్డును అందుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి కెటిఅర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్‌గా గుర్తించి అవార్డును ప్రధానం చేసింది. అమెరికాలోని నేవెడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కె.టి. రామారావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం, మిషన్ భగీరథ పాజెక్టులపైన ప్రసంగించారు.

సిఎం కెసిఆర్ మేధస్సుకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి 2017లో ఇదే వాటర్ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో వివరించే అవకాశం తనకు దక్కిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆరోజు తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలపైన ఆశ్చర్యం వ్యక్తం చేసిన సమావేశం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరంప్రాజెక్టుకు అవార్డు అందించడం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ మేధస్సుకు దక్కిన ఒక అపూర్వమైన గుర్తింపుగా భావిస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు.తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం రూపాంతరం చెందిన తీరుని, అన్ని రంగాల్లో సాధిస్తున్న విజయాలను, ముఖ్యంగా ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించిన తీరును ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల్లో అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించిందని, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందన్నారు. దేశంలోనే తొలిసారిగా అందరికీ మంచినీళ్లు అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

అతి తక్కువ సమయంలోనే కాళేశ్వరం పూర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిచేసిందని కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఆలోచించని విధంగా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించే ఒక బృహత్ సంకల్పంతో మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒక నాయకుడు తలుచుకుంటే సాధించే గలిగే ఒక గొప్ప విజయానికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు సాగునీరు అందక కరువుకు నిలయంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది చెరువులు నిండక, సాగునీరు లేక భూగర్భ జలాలు లేక.. తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని వ్యవసాయ రంగం సంక్షోభంలో నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, వలసలు ఒకప్పుడు నిత్యకృతంగా ఉండేయని కెటిఆర్ చెప్పారు. 55 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం అనే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించి, నిరంతర కృషితో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సమస్యలు, సంక్షోబాలు, తెలంగాణ ప్రజల ఆశలు, కలల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వాటిని సాధించేందుకు అవసరమైన పక్కా ప్రణాళికను రూపొందించి, వాటికి కార్యరూపం ఇచ్చేలా కఠినమైన శ్రమతో, వాటిని నిజం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఆయన మదిలోంచి పుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేశారని చెప్పారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తున ఉన్న నీటిని 618 మీటర్ల స్థాయికి ఎత్తిపోతల ద్వారా తీసుకుపోయి వివిధ ప్రాజెక్టులు నింపడం ప్రపంచ సాగునీటి చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు స్థాయిని గుర్తించి అవార్డు అందించిన నిర్వాహకులకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు స్థాయిని వివరించేందుకు కొన్ని కీలకమైన అంశాలను చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం తరలించిన మట్టి ద్వారా 101 గిజా పిరమిడ్లను నిర్మించవచ్చని, ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన స్టీల్ ద్వారా 66 ఈఫిల్ టవర్ల నిర్మాణం చేయవచ్చని, ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన కాంక్రీట్ ద్వారా 53 బూర్జ్ ఖలీఫాలు కట్టవచ్చని, ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును తెలంగాణ అతి తక్కువ సమయంలో నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు.

కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం
కాళేశ్వరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని ఒక ఇంజనీరింగ్ అద్భుతం కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన సాంకేతిక అంశాలను ప్రస్తావించారు.13 జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్ల మీద ఈ ప్రాజెక్టు విస్తరించిందని, 1,800 కిలోమీటర్ల కాల్వల నిర్మాణం జరిగిందని ఏడు మెగా లింకులను 28 ప్యాకేజీలుగా 22 పంపు హౌస్‌ల నిర్వాణం చేశారని అన్నారు. ఇందులో ఉపయోగించిన బాహుబలి లాంటి పంపు 139 మెగావాట్ల కెపాసిటీని ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ కోసం 20 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని, 50 టిఎంసిలతో మల్లన్న సాగర్ లాంటి అతి పెద్ద రిజర్వాయర్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 240 టిఎంసిల నీటిని సాగునీటి కోసం, తాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే అవకాశం ఉందని వివరించారు.
ఇంత పెద్ద ప్రాజెక్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక అద్భుతమైన మార్పులు జరిగాయని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యాగారంగా మారిందని 90 లక్షల ఎకరాల్లో రెండు పంటలుగా సాగవుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుభూమి 119 శాతం పెరిగిందని, ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం సాగు చేస్తున్న విస్తీర్ణం 25 లక్షల ఎకరాల నుంచి 97 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు.

మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత విముక్తి
కాళేశ్వరంప్రాజెక్టుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ గురించి కెటిఆర్ పలు వివరాలు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఆలోచించని విధంగా తొలిసారిగా ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించాలన్న బృహత్ సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును కూడా స్వల్ప కాలంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిసారి 100 శాతం తాగునీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. దీంతోపాటు దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్య నుంచి తెలంగాణ శాశ్వతంగా విముక్తి అయిందన్నారు.

ఇలా ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా నీటి పాఠాలు చెప్పిందంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిచేందుకు అవకాశం దొరికిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెండవ హరిత విప్లవం కొనసాగుతుందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో శ్వేత విప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, నూనె గింజల తాలూకు ఎల్లో విప్లవం వ్యవసాయ రంగంలో వస్తున్నాయని వివరించారు. ఇందుకు సంబంధించిన అనేక సవివరమైన గణాంకాలను కెటిఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఒక నాయకుడి అచంచలమైన నిబద్దతకి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శం
ఒక నాయకుడి అచంచలమైన నిబద్దతకి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనని కెటిఆర్ అన్నారు. ఒక నదిని ఎత్తిపోసి, లక్షలాదిమంది జీవితాల్లో వెలుగును నింపి జీవనోపాది కల్పించిన ఘనత కెసిఆర్‌కి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రగతి ప్రస్థానం, ఇంజనీరింగ్ నైపుణ్యం, దాని ద్వారా కలిగిన మార్పులు ఈరోజు ప్రపంచానికి, సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆదర్శంగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను బలంగా ఎదుర్కోవడంలో, ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంలో, ఏ కల కూడా అసాధ్యం కాదని నిరూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలు గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని తాను నమ్ముతున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News