నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో తగిన సాయం అందలేదు
అయినా సిఎం కెసిఆర్ దీక్షదక్షతలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగెత్తిస్తున్నారు : సికింద్రాబాద్ ఎస్‌విఐటి ఆడిటోరియంలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి వాణీదేవికి మద్ధతుగా జరిగిన సభలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీలేదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. అన్ని రంగాల్లో కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. దీనిపై ఇప్పటికే తాను అంకెలతో సహా వివరి ంచానన్నారు. ఈ అంశాలపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమేనని ఆయన మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో కేంద్రం ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి సుమారు ఆరున్నర సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి తగు సాయం అందకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకపోతున్నదని ఆయన వాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడకముందు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎస్‌విఐటి ఆడిటోరియంలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్ధి సురభి వాణిదేవీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రైవేటు కాలేజెస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపియేతర ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను వేసిందని పేర్కొనడానికి తెలంగాణ రాష్ట్రమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎంతో ముందుచూపుతో సిఎం కెసిఆర్ తీసుకున్న పలు విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. ఇలాంటి రాష్ట్రానికి కేంద్రం చేయూతనిస్తే…మరిన్ని అద్భుతాలు సృష్టించడానికే అవకాశముంటుందన్నారు.
తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఇక్కడ పరిశ్రమలు ఉండవని, తెలంగాణ వస్తే ఆంధ్ర, తెలంగాణకు మధ్య గొడవలు జరుగుతాయన్నారన్నారు. అసలు పరిపాలన చేయగలరా? అని ప్రశ్నించారని గుర్తు చేశారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇంకా సెటిల్ అవలేదని కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పిన మాటలను కూడా మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. కానీ తెలంగాణ వచ్చాక ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. తాను చదువుకునే రోజుల్లో ఎండాకాలం మహిళలు బిందెలతో ధర్నాలు చేసేవారన్నారు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే…. కెసిఆర్ నా తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగణ చేస్తున్నారని అన్నారు.. హైదరాద్‌లో 5లక్షల సిసి కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి ఎమ్‌ఎన్‌సి కంపెనీలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో బలమైన న్యాయకత్వం, భద్రత వల్లే ఈ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు దీనిపై ఇటీవలే శ్వేత పత్రం కూడా ఇచ్చామని కెటిఆర్ గుర్తు చేశారు.
ఆరున్నర సంవత్సరాలలో అద్భుత ప్రగతి
అనేక అనుమానాలు మధ్య ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలలో అద్భుతమైన విజయాలతో కొనసాగుతోందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. దేశం ఎరుగని అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందువరుసలో రాష్ట్ర ప్రభుత్వం దూసుకపోతున్నదన్నారు. విద్యుత్ కోతల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా కొనసాగుతోందన్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో తాగు నీటి కొరతను పూర్తిగా అధిగమించడం జరిగిందన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా తీసుకున్న చొరవ, పట్టుదలే కారణమన్నారు. గతంలో రెండు వారాలకు ఒకసారి తాగునీరు వస్తుంటే ప్రస్తుతం తాగు నీటి సరఫరా దాదాపుగా ప్రతిరోజు అందుతున్నదన్నారు. అలాగే వ్యవసాయరంగానికి కూడా 24 గంటల పాటు సాగునీరు, కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో లక్ష కోట్ల విలువైన పంట ను ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి చేరుకున్నామన్నారు. రాష్ట్రంలోని విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే అందులో దాదాపు 19200 టీచర్ పోస్టులను భర్తీ చేశామని కెటిఆర్ వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తమపై బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగాలు కల్పించేలా టిఎస్..ఐపాస్ వంటి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకొనివచ్చి భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చామన్నారు. 15 వేలకు పైగా కంపెనీలకు అనుమతులు ఇచ్చి సుమారు 15 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించగలిగామన్నారు.
జాతీయస్థాయిలో ఐఐఎం, ఐఎసర్, ఎన్‌ఐడి, మెడికల్ కాలేజీల వంటి విద్యా సంస్థలను కేంద్రం భారీ ఎత్తున ఏర్పాటు చేసినా… తెలంగాణకి మాత్రం ఒక్క దానిని కూడా కేటాయించలేదన్నారు. ఇది కేంద్రప్రభుత్వ వివక్ష వైఖరిని తెలియజేస్తోందనన్నారు. విద్యారంగంపై కేంద్రం వివక్ష చూపిస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాఠశాల విద్యకు సంబంధించి అద్భుతమైన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కెటిఆర్ వివరించారు. 2014కు ముందు తెలంగాణలో 248 గురుకుల పాఠశాలలు ఉంటే కొత్తగా మరో 647 గురుకుల పాఠాశాలలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో 4 లక్షల32 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం లక్షా 20వేలు ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తూ…నీట్, జెఇఇతో పాటు ఇతర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. కేవలం స్కూల్స్ మాత్రమే కాకుండా ఆపై తరగతుల విద్యార్ధులకు కూడా స్కాలప్‌షిప్‌లను అందిస్తున్నామని మంత్రి కెటిఆర్ వివిరించారు. గత ఆరు సంవత్సరాలలో రూ.12,800కోట్ల మేర విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇచ్చామన్నారు. అలాగే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్, జ్యోతిబాపులే, వివేకానంద ఓవర్సీస్ స్కాలర్ పేరిట విదేశాల్లో చదువు కోవాలనుకునే విద్యార్ధులకు ఒక్కరికి రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. 65యేండ్లలో 5మెడికల్ కాలేజీలు ఉంటే ఈ ఆరేళ్లలో మరో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సూర్యాపేట్, నల్లగొండస, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, ఆదిలాబాద్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకన్నానారు. ఇగి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. అంగన్‌వాడీ పిల్లల నుంచి మొదలుకుంటే పిజి స్థాయి వరకు విద్యార్ధులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యంతో భోజనం పెట్టే వారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొలత లేకుండా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని కడుపునిండా పెడుతున్నామని చెప్పారు.
మోడీ ఫోటోలకు దండం పెడుతున్నారు
దేశంలో పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలను చూసి వాహనదారులు బెంబేలెత్తుతున్నారని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు.2013లో అప్పటి గుజరాత్ సిఎం మోడీ నాటి ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి మీది చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ రూ.100కి చేరిందన్నారు. దేశం కోసం…ధర్మం కోసమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచాల్సి వచ్చిందని మోడీ ప్రభుత్వం పచ్చి అబద్ధలాడుతోందని ఆయన మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం వాహనదారులు పెట్రోల్ బంకుల్లో మోదీ ఫోటోలకు దండం పెడుతున్నారన్నారు.
సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ కనిపించడం లేదు
మోడీ చెబుతున్న విధంగా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడా కనిపించడం లేదని కెటిర్ వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో మన రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపించిందన్నారు. అలాంటప్పుడు అన్ని రాష్ట్రాలు సమానంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ప్రస్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పుడు మాట్లాడినా తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని ఎంతో గొప్పగా చెబుతుంటారన్నారు. కానీ తెలంగాణ నుంచి 2లక్షల కోట్లు పన్నుల కడితే… తిరిగి మనకు లక్ష కోట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అంటే రాష్ట్రం రూపాయి కడితే కేంద్రం నుంచి ఆటానా కూడా రావట్లేదన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఒక్క ఐఐఎం కూడా మంజూరు చేయలేదన్నారు. ఎన్‌ఐటి, ఎయిమ్స్, ఐసార్, నవోదయ, మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా తెలంగణకు ఇవ్వలేదన్నారు. గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం మాత్రం దక్కడం లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానంగా ఐటిఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ల విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్నారు. అలాగే చట్టప్రకారం దక్కాల్సిన విభజన చట్టం హామీలను సైతం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ నేత సాయి కిరణ్ యాదవ్, ప్రైవేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పిఎల్ శ్రీనివాస్, ప్రేమ్ నారాయణ, శ్రీనివాస్, సుషీల్ కుమార్, రూప తదితరులు పాల్గొన్నారు.
KTR speech in MLC Election Campaign in Secunderabad