హైదరాబాద్: భాగ్యనగరం వేగంగా విస్తరిస్తోందని, ఓవర్ నైట్ అన్నీ అయిపోతాయనుకోవడం సరికాదని మంత్రి కెటిఆర్ తెలిపారు. పట్టణ ప్రగతిపై మంత్రి కెటిఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. శరవేగంగా పట్టణీకరణ జరుగుతోందని, ప్రజలు జీవన ప్రమాణాలు పెరగాలని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, 2014లో తెలంగాణ జిఎస్‌డిపి 5.06 లక్షల కోట్లు అని,2022 లో జిఎస్‌డిపి 11.55 లక్షల కోట్లకు పెరిగిందని ప్రశంసించారు. హైదరాబాద్ నుంచే 40 -50 శాతం జిఎస్‌డిపి వస్తుందన్నారు. 60-70 శాతం జిఎస్‌డిపి హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచే వస్తుందని, పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాల ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.
తెలంగాణ విస్తీర్ణం 1.12 లక్షల కిలో మీటర్లు ఉందని, హైదరాబాద్ 375 చదరుపు కిలో మీటర్లు మాత్రమే ఉందన్నారు. పావు శాతం జనాభా హైదరాబాద్‌లోనే ఉందని కెటిఆర్ వెల్లడించారు. ఎక్కువ ఒత్తిడిపట్టణాలపై పడడంతో సమస్యలను పరిష్కరించేందుకు మనకు ఛాలెంజ్‌గా మారిందన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఎం కెసిఆర్ పదే పదే చెబుతున్నారని కెటిఆర్ గుర్తు చేశారు. జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించకుంటే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయని, మున్సిపాలిటీ సిబ్బంది చేసినంత గొడ్డు చాకిరి ఎవరు చేయడంలేదన్నారు. మున్సిపల్ సిబ్బందిని అందరూ అభినందించాల్సిందేనని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరపాలన్నారు. కౌన్సిల్ సమావేశంలో కెమెరాలు పెట్టడం బంద్ చేయాలన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను తిట్టడం మానుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.