హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు కావొస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జీవితం-సామరస్య విలువలపై సదస్సు జరిగింది. ఎంఎల్ సి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. గత పది రోజులుగా ఉద్యమ సహచరులను కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని, కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలా మంది వారించారని, అర్థబలం లేదు… అంగబలం లేదు… మనీ పవర్ లేదు ఎందుకు ఉద్యమమని కొందరు హేళన చేశారని గుర్తు చేశారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు కెసిఆర్‌కు సహకరించలేదని, మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని తెలంగాణ సాధించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ సాధించకుండా ఉద్యమం వీడితే రాళ్లతో కొట్టి చంపండి అని ధైర్యంగా ప్రకటించే సత్తా ఉన్న నాయకుడు కెసిఆర్ అని చెప్పారు.
2009లో తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ సచ్చుడో అని కెసిఆర్ దీక్ష చేపట్టాడని, తెలంగాణ రాష్ట్రం సాధ్యమౌతుందని ప్రజల్లో నమ్మకం కలిగిందని, తెలంగాణ వ్యాప్తంగా సకలజనులు రోడ్లపైకి వచ్చి కెసిఆర్‌కు అండగా నిలిచారని ప్రశంసించారు. 45 ఏళ్ల వయసులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ నడుం బిగించారని, చెన్నారెడ్డిలాంటి వాళ్లే అనుకున్నది సాధించలేదని, ఆనాడు కెసిఆర్‌ను ఎందరో నిరుత్సాహపరిచారని, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బిజెపి తరువాత మాటమార్చిందని దుయ్యబట్టారు. ఆనాడు పదవులను త్యాగం చేసి తెలంగాణ ప్రజల్లో సిఎం కెసిఆర్ విశ్వాసం పెంచారని గుర్తు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.