హైదరాబాద్: మా ప్రభుత్వ విధానాలు ఇతర పార్టీలకు ఎన్నికల నినాదాలుగా మారాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు విమర్శించారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ మంత్రి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని లిఖించింది. తెలంగాణ భవన్ వేదిగ్గా నేను.. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే రైతులకు వేరే రాష్ట్రాల్లో ఇంత మేలు ఏదైనా చేశారో చెప్పండి. చర్చకు సిద్ధం. మేము శ్వేత పత్రాలు ఇస్తున్నాం.. నల్ల చట్టాలు కాదు. రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ పర్యాటక రంగానికి అది మేలు చేస్తుండొచ్చు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు.. గణాంకాలు ఉంటే చెప్పండి. మా కంటే ఎక్కువ రుణ మాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పండి. విమర్శించే వాళ్లకు నెత్తి లేదు.. కత్తి లేదు.
మండు వేసవిలోనూ తెలంగాణలో చెరువులు మత్తడ్లు దుంకుతున్నాయి. తెలంగాణలో హార్వెస్టర్ల, ట్రాక్టర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉంది. సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి), శ్వేత విప్లవం, నీలి విప్లవం గట్టిగా అమలు చేస్తున్నాం. వ్యవసాయం అనుబంధ విభాగాలకు 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రాథమిక రంగాల్లో తెలంగాణ వృద్ధి రేటు 8 శాతానికి పెరిగింది.. తెలంగాణ వచ్చినపుడు అది1.8 శాతమే. తెలంగాణ జిఎస్ డిపి పెరగడానికి రైతన్నల భాగస్వామ్యం ఎంతో ఉంది. రైతు బంధు సమితులు, రైతు వేదికలు ఏర్పాటు చేసి అన్నదాతాల్లో విశ్వాసం నింపాం” అని తెలిపారు.
KTR Speech on Rythu Bandhu at Telangana Bhavan