తెలంగాణ విధానాలు దేశానికి ఆదర్శం
టిఎస్ ఐపాస్, టిఎస్ బిపాస్ కొత్త పంచాయతీ రాజ్ మున్సిపల్ చట్టాలు ల్యాండ్ రికార్డు మేనేజ్‌మెంట్‌లో కొత్త విధానం ఆదర్శప్రాయమైనవి
హార్వార్డ్ ఇండియా సదస్సులో మంత్రి కెటిఆర్
దేశంలోని వనరులను, అవకాశాలను ఉపయోగించుకుంటే భారత ప్రగతిని ఎవరూ ఆపలేరు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే దేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదని మంత్రి కె. తారకరామారావు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అనే అంశం పైన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగానికి సదస్సుకు హాజరైన వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశం అభివృద్ధి మరింత వేగవంతంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద కాటన్ ఉత్పత్తి చేసే దేశంగా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ ,శ్రీలంక ల కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తుంది ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ధరలకన్నా భారతదేశంలో తయారుచేసే మెడికల్ డివైసెస్ పరికరాల ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఇందుకు అడ్డుగా ఉన్న విధానాలు ఏమిటి? భారతదేశం కన్నా అతి చిన్న దేశాలైన వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి?
ఇందులో భారత దేశాన్ని అడ్డుకుంటున్న పరిస్థితులు ఏమిటి? భారతదేశంలోని నదులు నిండా నీళ్లు పారుతున్నప్పటికీ ఎండిపోతున్న బీడు భూములు ఎందుకున్నాయి? కరువు పరిస్థితులు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నలకు దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం చైనాల జిడిపి 35 సంవత్సరాల క్రితం సమానంగా ఉన్నప్పటికీ, ఈ రోజు చైనా భారతదేశం కన్నా అనేక రంగాల్లో చాలా ముందు వరుసలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు. సరైన పరిపాలనా విధానాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్తుకి అవసరం అయ్యే విప్లవాత్మకమైన సంస్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలకు సిద్ధంగా ఉండేలా మౌలిక వసతుల కల్పన చేయడం వంటి కొన్ని ప్రాథమిక కార్యక్రమాలను చేపడితే దేశ పురోగతి మరింత వేగంగా ముందుకుపోతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఏడు సంవత్సరాల్లోనే దేశానికి పాఠాలు చెప్పే స్థితికి తెలంగాణ
దేశంలోనే అతి తక్కువ వయసు కలిగిన నూతన రాష్ట్రం తెలంగాణ గత ఏడు సంవత్సరాలు అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పే విధంగా ముందుకుపోతున్నదని కెటిఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తీసుకువచ్చిన టిఎస్ ఐపాస్ మొదలుకొని తర్వాత కాలంలో వచ్చిన టి ఎస్ బి పాస్, నూతన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలు, నూతన విధానం ద్వారా ల్యాండ్ రికార్డ్ మేనేజ్‌మెంట్ వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేందుకు దోహదం చేస్తున్న పరిపాలన సంస్కరణలని కెటిఆర్ అన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన పైన దేశంలోని ఏ రాష్ట్రం, స్వతంత్ర భారత చరిత్రలో ఆలోచించని స్థాయిలో కాలేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ రంగంలోని మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, టీఎస్ ఐపాస్, పట్టణ ప్రకృతి వనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు స్ఫూర్తి తీసుకొని, తమ తమ రాష్ట్రాల్లో ప్రారంభించిన విషయాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగం ఐటి, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వలన 5 వ్యవసాయ విప్లవాలు తెలంగాణలో పరిఢవిల్లే పరిస్థితి నెలకొన్నదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాలి
భారతదేశం తన బలమైన మానవ వనరులు, థింక్ ఫోర్స్ ని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల నిర్మాణంలో భారీగా ఆలోచించినప్పుడే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. భారతదేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉందని ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ హబ్, వి హబ్, అగ్రి హబ్ వంటి ఇంకుబేటర్లను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాష్ట్రం ప్రభుత్వ విధానాలను భారతదేశం స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్లినప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఆవిర్భవించే అవకాశం పుష్కలంగా ఉందన్న విశ్వాసాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా వ్యక్తపరిచారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచించినది, తరువాత భారతదేశం ఆలోచిస్తున్నదన్న నానుడి ఉండేదని ఈ రోజు తెలంగాణ ఆలోచించింది, చేసింది రేపు భారతదేశం చేస్తున్నదన్న విశ్వాసం తనకు ఉందని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.