రాజన్నసిరిసిల్ల: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోందని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందని, సిఎం కెసిఆర్ హాయాంలో రైతుకు వ్యవసాయానికి పెద్ద పీట లభిస్తోందని, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్ల లో తుడిచి పెట్టగలిగామన్నారు. అపుడు కరెంటు కూడా కిస్తీల వారీగా ఇచ్చేదని, దిక్కు లేని పరిస్థితి ఆనాడు కనిపించిందని గుర్తు చేశారు. పాలకులు పచ్చ కండువాలు వేసుకున్నా రైతుల జీవితాలు ఆనాడు బాగు చేయలేక పోయారని మండిపడ్డారు. గతంలో అన్నిటికీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేదన్నారు. కెసిఆర్ ఎం మ్యాజిక్ చేస్తే 24 గంటల కరెంటు వచ్చిందని కొందరు అడుగుతున్నారని, పాలకుల మనసు బాగుంటే అన్నీ బాగుంటాయని మెచ్చుకున్నారు.
కొందరి పాలనలో వరసగా కరువే ఏర్పడిందని, ఇపుడు కరువు కూడా లేదన్నారు. చెరువులకు 20 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పల్లె జీవితాన్ని బాగు పరుచుకోగలిగామని, ప్రపంచంలో మేధావులమని ఫోజు గొట్టే వాళ్లకు రాని ఆలోచన సిఎం కెసిఆర్ కు వచ్చిన ఫలితమే రైతు బంధు, రైతు బీమా అని కెటిఆర్ ప్రశంసించారు. మన రైతు బంధు ను కేంద్రంతో సహా పదకొండు రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. రైతు చనిపోయిన పది రోజుల్లోపే బీమా కింద ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయని, నడి ఎండాకాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. సిరిసిల్ల పట్టణంలో బ్రిడ్జి కింద నీళ్లు ఎపుడైనా చూశామా? అని కెటిఆర్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాల తో పోటీ పడి సిఎం కెసిఆర్ నిర్మించారని, రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నది కెసిఆర్ కాదా? అని రైతులను అడిగారు. తెలంగాణ రైతు ఇపుడు కాలర్ ఎగురేసి గర్వంగా చెబుతున్నాడు ధాన్యం ఉత్పత్తి లో పంజాబ్ ను దాటి పోయామని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా గ్రామాలబాటబట్టి వ్యవసాయం చేస్తున్నారంటే అది కెసిఆర్ రైతు పక్షపాత విధానాల ఫలితమేనన్నారు. రైతు ను రాజు చేయాలన్నదే కెసిఆర్ తపన అని, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గూగుల్ లో ఎవ్వరూ వెతికినా తెలిసి పోతుందని, 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణ పండించిందని తెలిపారు.