మన తెలంగాణ/హైదరాబాద్ : వరల్డ్, ఆసియన్ ఛాంపియన్‌షిప్‌సలో ఆరు పతకాలు సాధించిన మాలికా హండా.డెఫ్ స్పోర్ట్ చెస్‌లో ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు మెరిసింది. జాతీయస్థాయిలో నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్‌ను ఏడుసార్లు గెలుచుకుంది. ఇన్ని పతకాలు, అవార్డులు సాధించిన మాలికకు పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. డెఫ్ స్పోర్ట్‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలంటి పాలసీ లేదని అధికారులు తప్పించుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆమె.. తన ఆగ్రహాన్ని, బాధను సైన్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటూ ఒక వీడియో చేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఒక వ్యక్తి.. ఇలాంటి వారికి క్రౌడ్ ఫండింగ్ ఆదుకోవాలని కోరారు. ఈ పోస్ట్.. తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి వచ్చింది. ‘ఈ యువ ఛాంపియన్ వివరాలు తెలియజేయండి. నేను వ్యక్తిగతంగా చేతనైన సాయం చేస్తాను’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు.
మాలికా హండా కుటుంబసభ్యులు హర్షం
ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది మాలికా హండా కుటుంబసభ్యులను సంప్రదించారు. పంజాబ్‌కు చెందిన తన కూతురికి సుదూరంలో ఉన్న మంత్రి కెటిఆర్ సహాయం అందించేందుకు ముందుకు రావడంపై మాలిక కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.