రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే ఆయనపై దుష్ప్రచారం, ఐటి, ఇడి దాడులు : మంత్రి కెటిఆర్
కొవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారు
ఆయన రియల్ హీరో, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారు, విపత్తుల్లో ప్రభుత్వమే అన్ని చేయజాలదు
స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరం : కొవిడ్ వారియర్స్ సన్మాన సభలో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు మద్దతుగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమంలోనే మంత్రి కెటిఆర్, సోనూసూద్, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. కోవిడ్ వారియర్స్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. కెటిఆర్ లాంటి నాయకుడు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదని అన్నారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని, అలాంటి బాధితులకు సాయం చేయడమే మన ముందున్న సవాలు అని సోనూసూద్ తెలిపారు. కోవిడ్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్ సమయంలో చాలా మంది కష్టపడి స్ఫూర్తిని నింపారని కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్.. సోనూసూద్‌కు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అందుకే సోనూసూద్‌పై ఐటీ, ఇడి దాడులు చేయించారని ఆరోపించారు.
ఇలాంటి వాటికి సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సోనూసూద్ వెంట తాము ఉంటామని వెల్లడించారు. కోవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని గుర్తు చేశారు. తన సేవ, పనితో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని అన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్ని చేయలేదని.. స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా సులువని, కానీ బాధ్యతగా సేవ చేయడమే గొప్ప అని వ్యాఖ్యానించారు. ‘మనం ఏదైనా పని మొదలుపెడితే పేరు కోసం, కీర్తి కోసం చేస్తున్నాడని తొలుత బద్నాం చేస్తారు. వేరే ఆలోచనలు ఉన్నాయి.. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు, ఏదో పదవి కావాలని అనుకుంటున్నాడని అంటారు. ఆ తర్వాత విమర్శలు చేస్తారు. అది కూడా విఫలం అయిన తర్వాత క్యారెక్టర్ కించపర్చడం మొదలుపెడతారు. ఇది ఎవరికో కాదు..సోనూసూద్‌కు కూడా జరిగింది. అయినా ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటూ కష్టపడి ప్రజలకు సేవ చేస్తుంటే ఐటి, ఇడి దాడులు చేశారు. ఎందుకంటే భయపడుతున్నారు.. ఆయన రాజకీయాల్లోకి వస్తే వాళ్లకెక్కడ నష్టమోనని రకరకాల దాడులు చేస్తున్నారు. సోనూ రియల్ హీరో. ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మేము మీ వెంట ఉన్నాం’ అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కెటిఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
KTR Supports Sonu Sood over IT Raids