Monday, December 23, 2024

మీది ఎన్నికల బిజీ, మాది అభివృద్ధి బిజీ… : కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ‘మీది ఎన్నికల బిజీ, మాది అభివృద్ధి బిజీ..’ అంటూ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గురువారం ట్వీట్ చేశారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీ(జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కొత్తగా కాలేజీల)లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా గురువారం స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో 33 జిల్లాలు జిల్లాకో మెడికల్ కాలేజీలుఉన్నట్లు అయ్యిందని తెలిపారు. అలాగే, ప్రతి జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజ్, 500 పడకల ఆసుపత్రి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇలా లేదని, ఏ ఒక్క రాష్ట్రం సైతం తెలంగాణకు దరిదాపుల్లో లేదని స్పష్టం చేశారు. ఇదంతా సిఎం కెసిఆర్ దార్శనికతతోనే సాధ్యమైందని వెల్లడించారు.

ప్రత్యర్థులు వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచించడంలో నిమగ్నమై ఉంటే, మన ముఖ్యమంత్రి మాత్రం రాబోయే తరానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో బిజీగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువవడంతో పాటు గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సిఎం కెసిఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. 2014నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో తెలంగాణలో 2,850 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడా సంఖ్య 8,340 సీట్లకు చేరిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News