ధాన్యం సేకరణను ప్రైవేట్‌కు అప్పగించడానికి కమలం కుట్రలు
మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోడీ, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే ఎత్తుగడ
అందుకే ప్రాణం పోయిన బాయికాడ మీటర్లు పెట్టనన్న కెసిఆర్
ఉచిత విద్యుత్‌కు రూ.10,500 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
మునుగోడు రైతులతో టెలికానరెన్స్‌లో మంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి రైతు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించుకొని రైతన్నులు మునుగొడులో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. మునుగోడు రైతులతో టెలికాన్షరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త అని, ఈరోజు కరెంటు పోతే వార్త అన్న మాదిరిగా పరిస్థితి మారిందన్నారు. ప్రతి సంవత్సరం రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల రూపాయల భారీ ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తమది అని కెటిఆర్ తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఆలోచించని విధంగా రైతన్న చేతిలో నగదు పెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గొప్పగా ఆలోచించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఇప్పటిదాకా సుమారు రూ.58 వేల కోట్ల రూపాయల రైతుబంధు నిధులను రైతన్నలకు అందించిన ప్రభుత్వం మాదని కెటిఆర్ అన్నారు. ప్రమాదవశాత్తు రైతన్నలు చనిపోతే వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఐదు లక్షల రూపాయల రైతు బీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపిన కెటిఆర్, కరోనా సంక్షోభ కాలంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ అని తెలిపారు. ఇప్పటిదాకా లక్షా 17వేల కోట్ల రూపాయాలతో ధాన్యం, ఇతర పంటలను కొనుగొలు చేశామన్నారు. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని కుటుంబానికి పిల్లనిచ్చేందుకు ఫ్లోరైడ్ భూతాన్ని బూచిగా చూపించిన పరిస్థితి నుంచి ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్న విషయంలో అలోచించాలని రైతన్నలను కోరారు. మునుగోడు నియోజకవర్గం బీడు భూములను శాశ్వతంగా పంటలుగా మార్చేందుకు నియోజకవర్గంలో లక్ష్మణ పల్లె, కృష్ణరాయని పల్లె, శివన్న గూడెం ప్రాజెక్టులు కడుతున్నది తమ ప్రభుత్వమేనన్నారు. కానీ బిజెపి అధికారంలోని కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిలోని నీటి వాటాలు తీర్చకుండా రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులకు మోకాలు అడ్డెందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. 65 సంవత్సరాల్లో చేయని అనేక రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఏడున్నర సంవత్సరాల చేసుకున్నామని, కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రభుత్వ విద్యుత్ సరఫరా కంపెనీలను ప్రైవేటుపరం చేసి ఉచిత విద్యుత్ని రైతులకి దూరం చేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదన్నారు. ఒక్కసారి విద్యుత్ సరఫరా కంపెనీలు ప్రైవేటుపరం అయితే పెట్రోల్ ధరల మాదిరే రోజువారీగా ధరలు పెరిగి విద్యుత్ ధరలు అకాశాన్ని అంటుతాయన్నారు. బిజెపి ప్రభుత్వ కుట్రలు ఫలిస్తే రైతుల మోటార్ల దగ్గర ప్రీపెయిడ్ మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుందని, దీంతో ముందస్తుగా డబ్బులు కడితేనే విద్యుత్ అందే పరిస్థితి వస్తుందన్నారు. ఇదే పరిస్థితి గనుక తలెత్తితే ఉచిత విద్యుత్తు అందిస్తున్న టిఆర్‌ఎస్ పార్టీకి భిన్నంగా ముందస్తుగా డబ్బులు కడితేనే విద్యుత్ సరఫరా అందే పరిస్థితిని బిజెపి తీసుకువస్తున్నదని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధాన్య సేకరణ విధానాలన్నింటిని రద్దుచేసి ప్రైవేట్ కంపెనీల ద్వారా ధాన్యాన్ని సేకరించే విధానానికి బిజెపి ప్రయత్నిస్తుందని, దీంతో రైతులకు కనీసం మద్దతు ధర లభించే పరిస్థితి ఉండదని మంత్రి కెటిఆర్ రైతన్నలకు వివరించారు. అందుకే ప్రాణం పోయినా మోటార్ల వద్ద మీటర్లు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీకి బలం ఇచ్చి సమర్ధించాల్సిన అవసరం ఉందని రైతన్నలకు కోరారు. బిజెపి గెలిస్తే రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని కేంద్రం రద్దు చేస్తుందన్నారు. కేవలం ఒక వ్యక్తి ప్రయోజనం కోసం, ఆయన కంపెనీ కాంట్రాక్టుల కోసం మునుగోడు నియోజకవర్గ ప్రజలపైన రుద్దబడిన ఈ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మునుగోడులో జరిగే ఎన్నిక కేవలం నియోజకవర్గానికి పరిమితం కాదని రాష్ట్రం మరియు దేశం మొత్తం చూస్తుందన్నారు. ఎన్నికల్లో బిజెపి గెలిస్తే బిజెపి రైతు వ్యతిరేక విధానాలకు ప్రజామోదం లభించినట్టు అవుతుందని, అందుకే రైతన్నలు ఆలోచించి ఓటేయాలని, బిజెపి అబద్దపు ప్రచారాలకి లోను కావద్దని మంత్రి కెటిఆర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు.
KTR Teleconference with Munugode Farmers