హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా మంగళవారం పారిశ్రామిక దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మంత్రి కెటిఆర్ దండుమల్కాపూర్‌లో 51 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక వాడలు, ఐటి కారిడార్లలో సభలు నిర్వహించి ఆ సభ ల్లో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని అధికారులు వివరిస్తారు.
టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని వివరిస్తారు. రాష్ట్రానికి తరలివచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు తెలియజేస్తారు. టి హబ్, వి హబ్‌లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించడంతో పాటు, ఐటి ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అధిగమించి దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన విషయాన్ని, అందుకు జరిగిన కృషిని మంత్రి కెటిఆర్ వివరిస్తారు.