హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ను ఈరోజు(బుధవారం) మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభకానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రయ్య, రవీందర్ రావు, విజయ భాస్కర్‌లు మంగళవారం పరిశీలించారు. నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసేందుకు ఈ కేఫ్ సిద్ధమైంది. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందించేందుకు ఎక్సెజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా సమీపంలో దీనిని నిర్మించింది.
ఆకర్షణీయంగా సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్ ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరాను సేవించడంతో పాటు పాటు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్ పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్థాలను, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలను విక్రయించనున్నారు. భవనం మొదటి అంతస్థులో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలను నిర్వహించుకునేలా విందులు ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో సేకరణ
నీరాలోని సహజమైన పోషకవిలువలు ఏ మాత్రం తగ్గకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి దీనిని విక్రయించనున్నారు. ఇందుకోసం నీరా భవనంలో ప్రత్యేక శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముదివన్‌లో ఏర్పాటు చేసిన తాటివనాల నుంచి ఈ నీరాను సేకరిస్తారు. పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం నుంచి దానిని వినియోగదారులకు అందించే వరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నారు. ఈ నీరాతో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. నీరాతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ద్వారా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయించనున్నారు. ఆడ, మగ (పోద్దాడు, పరుపుదాడు) తాటి చెట్ల నుంచి సేకరించే రెండు రకాల తాటి బెల్లం ఇక్కడ లభించనుంది.