సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 90 కోట్లతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఈనెల 30వ తేదీన ఐ.టీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేసేందుకు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 200 మందికి రూ.1.3 కోట్ల సీ.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మినిస్టేడియం, అంబేద్కర్ ఆడిటోరియం, షాది ఖానా, క్రీస్టియన్ భవన్, చాకలి ఐలమ్మ భవన్, సెంట్రల్ లైటింగ్ వంటి పలు అభివృద్ధి పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2019 నుంచి నేటి వరకు 5023 మంది లబ్ధిదారులకు గాను రూ. 26.30 కోట్ల విలువ గల సీ.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు సండ్ర పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు తయారైందని, 5 గ్యారెంటీల బూటకపు మాటలతో ప్రజల ముందుకు వస్తుందన్నారు.
బడ్జెట్ తో పొంతనలేని మేనిఫెస్టోను రూపొందించి ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఎత్తుగడలు వేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామంటూ నమ్మబలకడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్ల మీద ఉన్న ధ్యాస ప్రజా సంక్షేమం మీద లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతుని రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక వినూత్న సహస్రపేతమైన పథకాలను రూపొందించి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంత బి.ఆర్.ఎస్ పక్షాన నిలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసుదేవరావు, పలువురు కౌన్సిలర్లు, ఐదు మండలాల ఎం.పీ.పీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సత్తుపల్లి డివిజన్ గ్రామ పంచాయతీల అధ్యక్షులు మందపాటి శ్రీనివాస్ రెడ్డి, అశోక్ , పాలకుర్తి సునీత రాజు, కనగాల వెంకట్రావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.