హైదరాబాద్: అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ చేతిలో రాజకీయ పావులుగా మారడం విచారకరమని తెలంగాణ మంత్రి కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు బట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ చేసిన ట్వీట్ ను మంత్రి రీట్వీట్ చేశారు.
ఇందులో తన అభిప్రాయాన్ని కూడా మంత్రి జోడించారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలతో ఒకలా, నాన్ బిజెపి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలతో మరొకలా కేంద్రం ప్రవర్తిస్తోందని కొణతం దిలీప్ ఆరోపించారు. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇందుకోసం గవర్నర్లు తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు.
బ్రిటీషర్ల కాలం నాటి వలస వాద గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన టైమొచ్చిందని తెలిపారు. ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టకుండా ఉండేందుకు తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సమర్థించారు. కొణతం దిలీప్ చేసిన ట్వీట్‌పై మంత్రి కెటిఆర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్లు రాజకీయ పావులుగా మారడం బాధాకరమన్నారు. నాన్ బిజెపి రాష్ట్రాలలో ప్రభుత్వాలకు గవర్నర్లు సహకరించకపోగా ఇబ్బందులకు గురిచేయ డానికి ప్రతీకారంతో వ్యవహరించడం కనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి వైఖరి సహకారసమాఖ్య పాలనకు మోడలా అని మంత్రి కెటిఆర్ ప్రశ్నిం చారు.