హైదరాబాద్ : రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో చురుకుగా ఉంటారు. అనునిత్యం ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు ఆయన. ప్రతి విషయాన్ని సునిశిత దృష్టితో పరిశీలించి తదనుగుణంగా ట్విట్టర్ ద్వారా సమాధానం చెబుతూ ఉంటారు. ప్రధానంగా మోడీ ప్రభు త్వం తెలంగాణపై కనబరుస్తున్న వివక్షతను పలు సందర్భాల్లో ట్విట్టర్ ద్వారానే ఆయన చాటి చెబుతూ విమర్శలు సంధిస్తూ ఉంటారు. తాజాగా కేంద్రమంత్రి హార్డీప్ సింగ్ పూరీ పార్లమెంట్ లో టాక్స్ గురించి చేసిన వ్యాఖ్యల పై ఆయన స్పందించారు. తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఎపి, తమిళ నాడు, కేరళ, ఝార్ఖండ్ టాక్స్ తగ్గించలేదని కేంద్ర మంత్రి పూరీ వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ప్రజలపై భారం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ధీటుగా మంత్రి కెటిఆర్ స్పందించారు. ఎన్‌పిఎ ప్రభుత్వం కారణంగానే ఇంధన ధరలు పెరిగాయని ప్రతిగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ 2014 నుండి ఇంధనంపై వ్యాట్‌ని పెంచలేదు, ఒక్కసారి మాత్రమే రద్దు చేయబడిందని గుర్తు చేశారు. ఈ విధంగా తాము వ్యాట్‌ని పెంచనప్పటికీ వ్యాట్‌ని తగ్గించనందుకు రాష్ట్రాల పేరు పెట్టడం.. అందులోనూ తెలంగాణను కేంద్ర మంత్రి పూరీ ప్రస్తావించడం.. ప్రధాని మోడీ మాట్లాడుతున్న కో-ఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా?- మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.