తెలంగాణ హరితహారం..: మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం. నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో మూడమూచ్చటగా ఉన్నదన్నారు. ఇదంతా సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ హరితహారం కార్యక్రమం వల్లనే సాధ్యమైందన్నారు.
దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలా సాగుతున్న తెలంగాణ హరితహారం అని కెటిఆర్ పేర్కొన్నారు. 230 కోట్ల మొక్కలు నాటాలన్న సమున్నత సంకల్పం, ప్రపంచ చరిత్రలోనే ఇదే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం, 33 శాతం గ్రీన్ కవర్ ఆశయం, పుడమితల్లికి వెలకట్టలేని ఆదరణం అని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు, ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటి చెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కెసిఆర్‌ది అని అని పేర్కొన్నారు. వానలు వాససు రావాలె, కోతులు వాపసు పోవాలె, ఈ మహోన్నత లక్షం నెరవేరుతోంది, ప్రతి పల్లె పచ్చదనంతో మురిసిపోతోంది, ప్రతి పట్నంలో హరిత శోభ వెల్లివిరుస్తోంది, ఆగమైన అడవి చుట్టూ పచ్చని పందిరి అల్లుకుంటోందన్నారు.
ప్రకృతి విపత్తులను అరికట్టాలన్నా, పర్యావరణ సమతుల్యత సాధించాలన్నా, ఆపదలో ఉన్న అటవీ సంపద కాపాడాలన్నా మానవజాతి చేతిలో వున్న ఏకైక బ్రహ్మాస్త్రం హరితహారం అని తెలిపారు. అందుకే, ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు గురైన అటవీ రంగానికి ఆక్సిజన్ అందించి తిరిగి ప్రాణం పోశారన్నారు. జంగిల్ బచావో.. జంగిల్ బడావో నినాదాన్ని సిఎం కెసిఆర్ అక్షరాలా నిజం చేశారన్నారు. మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే కాదు.. ప్రపంచంలోని గ్రీన్ కవర్‌ను పెంచే మూడో అతి పెద్ద మానవ ప్రయత్నానికి కేరాఫ్ అడ్రస్ మన తెలంగాణ అని అన్నారు. భవిష్యత్ తరాలకు మనమిచ్చే వారసత్వ సంపద, కాంక్రీట్ జంగిళ్లు కాదు.. పచ్చని అడవులని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసిన సందర్భమిదని తెలిపారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా, ఈ గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు అని పేర్కొంటూ కెటిఆర్ తన ట్వీట్ ముగించారు.