Sunday, December 22, 2024

“కాంగ్రెస్ చేసిందేంది..?” పుస్తకాన్ని ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్‌కు అండగా నిలవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత స్థితప్రజ్ఞత కలవారో తెలుసునని…అది గతంలో రెండుసార్లు ఎన్నికల్లో రుజువు కూడా అయ్యిందని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే అది బిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో, ఏం చేయగలదో, అంతా ప్రజలకు తెలుసునని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విశ్లేషణ “కాంగ్రెస్ చేసిందేంది..?” అనే పుస్తకాన్ని సోమవారం కెటిఆర్ ప్రగతిభవన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఏం వెలగబెట్టిందో ఈ పుస్తకం బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ వల్ల కాదని, డిసెంబరు 3వ తేదీన తెలంగాణ అంతా పింక్‌మయం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అంటే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ఆత్మలాంటిదని, తెలంగాణకు కెసిఆర్ ప్రాణమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న తెలంగాణ పునర్నిర్మాణధారి కెసిఆర్‌ను ప్రజలు గెలిపించుకుంటారని పేర్కొన్నారు.

తెలంగాణను ధ్వంసం చేసెందెవరో…? తెలంగాణను పునర్నిర్మిస్తుందెవరో తెలంగాణ మట్టికి తెలుసు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించినా, ఈ గోల్ మాల్ కాంగ్రెసును ప్రజలు నమ్మరని తెలిపారు. తెలంగాణ కన్నీళ్ళను తుడిచి బీడు భూములపై గంగమ్మను ప్రవహింపచేస్తున్న కెసిఆర్‌ను తెలంగాణ తన గుండెల్లో దాచుకుంటుందని చెప్పారు. చెరువుల్ని చంపి, అడవుల్ని ధ్వంసం చేసి, ప్రగతి నిరోధకంగా మారి, గ్రామస్వరాజ్యాలను నిర్వీర్యం చేసి 60 ఏళ్ళు తెలంగాణను నిస్తేజంగా మార్చిన కాంగ్రెస్ అసలు రంగు ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా 30వ తేదీన బ్యాలెట్ బాక్సుల్లో బిఆర్‌ఎస్ విజయం పదిలమని అన్నారు. తెలంగాణను చీకట్లలో ముంచిన కాంగ్రెస్‌ను, తెలంగాణను వలవలా ఏడ్పించిన కాంగ్రెసును ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఎండిన భూములు, రాష్ట్రం నుంచి లక్షల సంఖ్యలో వలసలు కొనసాగాయని, బిఆర్‌ఎస్ పాలన పసిడి పంటల తెలంగాణగా వర్థిల్లుతుందన్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకుపోగా బిఆర్‌ఎస్ అధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మించబడుతూ దేశానికే మోడల్‌గా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు వ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లుగా పుస్తకాన్ని వెలువరించిన జూలూరు గౌరీశంకర్‌ను కెటిఆర్ అభినందించారు. ఈ పుస్తకం కాంగ్రెస్ అసలు రూపాన్ని బయటపెడుతుందని కెటిఆర్ అన్నారు.

బహుజనులే బిఆర్‌ఎస్ ప్రాణం : కెటిఆర్
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా విశ్వకర్మల చేతివృత్తులను ఆధునీకరించి వారి నైపుణ్యాలను విశ్వవ్యాప్తం చేస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. విశ్వబ్రాహ్మణ సమాజం 60 ఏళ్ళుగా ఎదుర్కుంటున్న సమస్యలను గత ఏలికలు విస్మరించారని, వాటినన్నింటినీ కెసిఆర్ మాత్రమే సమర్థవంతంగా పరిష్కరిస్తారని చెప్పారు. విశ్వకర్మీయుల ఉత్పత్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించటం ద్వారా వారి నైపుణ్యాలు మెరుగుపడి వారు ఉత్పత్తి శక్తులుగా ఎదుగుతారని అందుకు బిఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని తెలిపారు. విశ్వబ్రాహ్మణ సమాజం ఎదుర్కుంటున్న సమస్యలను కెటిఆర్‌కు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సోమవారం నాడు ప్రగతిభవన్‌లో విన్నవించారు.

నేత,గీత కార్మికులకు ఇస్తున్నట్లుగా 50 సంవత్సరాలు దాటిన విశ్వబ్రాహ్మణులకు పెన్షన్ స్కీం వర్తింప చేయాలని, విశ్వకర్మ చేతివృత్తిదారులకు 250 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని, విశ్వకర్మలు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల అందించాలని విశ్వకర్మలు కోరుతున్న విన్నపాలను కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. విశ్వకర్మ సమాజానికి దేశంలో ఎక్కడాలేని విధంగా రాజధానిలో 5 ఎకరాల స్థలమిచ్చి ఆత్మగౌరవ భవన నిర్మాణం బిఆర్‌ఎస్ ప్రభుత్వమే చేపట్టిందని కెటిఆర్ అన్నారు. 42 బిసి కులాలకు ఆత్మగౌరవ భవన స్థలాలనిచ్చి ప్రభుత్వమే వాటి నిర్మాణ బాద్యతలు చేపట్టిన చరిత్ర దేశంలో ఒక్క బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఈ ఆత్మగౌరవ భవనాలు చేతివృత్తుల జ్ఞానకేంద్రాలుగా సాంకేతిక జ్ఞానంతో పొద్దుపొడిచే అభివృద్ధి కేంద్రాలుగా వెలుగొందుతాయన్నారు. విశ్వబ్రాహ్మణ సమాజాన్నీ, మొత్తం బహుజనవర్గాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టి దాచుకుంటుందని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News