మల్లేశం, కాంచివరం తరహాలో చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన చిత్రం ’తమసోమా జ్యోతిర్గమయ’. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. విమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై తడక రమేష్ నిర్మిస్తున్న చిత్రమిది. గుణ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేయగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్‌వైడ్‌గా పద్మజ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి కెటిఆర్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత తడక రమేష్ మాట్లాడుతూ “చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారి కథ ఇది. మారుతున్న కాలాన్ని బట్టి చేతివృత్తుల వాళ్ళు కూడా మారగలిగితే చాలా మందికి ఉపాధి దొరుకుంతుంది అని ఈ చిత్రం ద్వారా చెప్పాము.
ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన సినిమా ట్రైలర్ చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేస్తానని అన్నారు”అని తెలిపారు. దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ “పోచంపల్లి చుట్టుపక్కల పరిసరాల్లోనే పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న సినిమా ఇది. ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ చిత్రంలో 2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవనస్థితిని చూపించబోతున్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ రాజ్, హీరోయిన్ శ్రావణిశెట్టి, సహా నిర్మాత సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.