Thursday, January 16, 2025

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు మరో పోరాటం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కెటిఆర్
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిధారెడ్డి చూపిన నిబద్ధత, తెగువ
తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందని వ్యాఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రయయిత నందిని సిధారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన రూ. 1 కోటి నగదు పారితోషికం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారరావు పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిధారెడ్డి చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కోటి రూపాయాలను, ప్లాట్‌ను తిరస్కరించిన సిధారెడ్డి నిర్ణయంపై కెటిఆర్ ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని అల్వాల్‌లోని నివాసంలో బుధవారం కెటిఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్, సిధారెడ్డి ఉద్యమకాల స్మృతులను నెమరు వేసుకున్నారు.ఈ సమావేశంలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్థిత్వ దాడులపై చర్చ జరగింది. ప్రభుత్వమే తెలంగాణ అస్ధిత్వంపైన కుట్రలు చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజానికి నందిని సిధారెడ్డి గట్టి సందేశం పంపారని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనకాడరని, సిధారెడ్డి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని అన్నారు.

ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. నందిని సిధారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కెటిఆర్, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నందిని సిద్ధారెడ్డి తాను రాసిన కొన్ని పుస్తకాలను కెటిఅర్‌కు అందజేశారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు బాల్క సుమన్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News