రాజకీయ వైరం ఉంటే మాపై కక్ష తీర్చుకోండి: కెటిఆర్
జయశంకర్ భూపాలపల్లి: ‘మాపై కోపం, రాజకీయ వైరం ఉంటే పగ తీర్చుకోండి ..కానీ రైతుల మీద.. రాష్ట్రం మీద పగ పట్టకండి’ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. బిఆర్‌ఎస్ ఇచ్చిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలం, మేడిగడ్డ బ్యారేజీని కెటిఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. 1.6 కిలోమీటర్ల విస్తీర్ణ బ్యారేజీ లో 50 మీటర్ల పరిధిలో ఒక సమస్య వచ్చిందనని అన్నారు. 85 పిల్లర్లలో ఒక పిల్లర్‌లో సమస్య ఉందన్నారు.
నిపుణులు బ్యారేజీని మరమ్మతు చేయవచ్చునని చెబుతున్నారని, కానీ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్లు కొట్టుకుపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చిల్లర ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ వైరం ఉంటే తమపై తీర్చుకోవాలి తప్ప రైతుల మీద కాదన్నారు. సత్వరమే బ్యారేజీ మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వచ్చే వానాకాలం లోపల మరమ్మతులు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. నీళ్లు లేక ఇప్పటికే కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో బాధ్యులపై ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అధికారులు, నిపుణులతో కమిటీ వేసి సేఫ్ స్టేట్‌కి తీసుకొని రావాలని కోరారు.