హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలతో శాసన సభలో దుమారం చెలరేగింది. సభలో అధికార కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల లాగే తాము కూడా రెచ్చగొట్టాలంటే ఆ పని చేయవచ్చని కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 30 శాతం కమీషన్లు అని కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలే అంటున్నారని కెటిఆర్ ఆరోపణలు చేశారు. 20 శాతం కమీషన్లని సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేయడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రీకౌంటర్ ఇచ్చారు.
బిఆర్‌ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని భట్టి హెచ్చరించారు. బిఆర్‌ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కెటిఆర్ ఆరోపణపై భట్టి తీవ్రంగా స్పందించారు. కెటిఆర్ గౌరవంగా మాట్లాడుతాడని తాను ఊహించానని, కెటిఆర్ సభనే కాదు రాష్ట్రాన్ని కూడా తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. మైకు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదని, బిఆర్‌ఎస్ సభ్యులు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని, బిఆర్‌ఎస్ వాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. సివిల్స్ కోచింగ్ వెళ్లే వారి కోసం లక్ష రూపాయలు సాయం చేయాలని ఆలోచిస్తే తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.40 వేల కోట్ల పనులు చేయించి బిల్లులు రాకుండా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. కెటిఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి సభాపతి తొలగించారు. భట్టి వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.