బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు బుధవారం ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొంతమంది ఎంఎల్ఎలను ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు ఖాకీ చొక్కాలు ధరించి శాసనసభకు వెళ్లారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎంఎల్ఎలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నెన్నో హామీలు ఇచ్చిందని, ఆ హామీలు ఏవీ అమలు కాలేదని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలని పేర్కొన్నారు. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం అని పేర్కొన్నారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, వారికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆటో కార్మికులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చామని, అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉందని మండిపడ్డారు. ఆటోడ్రైవర్ల కు సంఘీభావంగా తాము వారి యూనిఫామ్లు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చామని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటోడ్రైవర్లకు ఏటా 12 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బిఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.