70లక్షల టన్నులే కొంటాం : కేంద్రం
కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్‌లతో మంత్రి కెటిఆర్ బృందం చర్చల్లో తేలని అంకె
26న మరోసారి భేటీ కావాలని నిర్ణయం
రాష్ట్రంలో వరి సాగు పరిస్థితిని
కేంద్రమంత్రులకు వివరించిన
మంత్రి కెటిఆర్ రెండు సీజన్లలో కలిసి
కోటి 50లక్షల టన్నులు కొనాలని విజ్ఞప్తి
70లక్షల టన్నులే తీసుకుంటామన్న
పీయూష్ గోయెల్ సీజన్ల వారీ పంట
వివరాలు తెలియజేయాలన్న కేంద్రమంత్రి
ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని
హామీ రాష్ట్ర మంత్రులు, ఎంపిల
బృందాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ
మంత్రి తోమర్ వద్దకు స్వయంగా
తీసుకెళ్లిన గోయెల్ సమావేశం
ముగిసిన తర్వాత నేరుగా సిఎం కెసిఆర్
వద్దకు వెళ్లి చర్చల సారాంశాన్ని వివరించిన
మంత్రి కెటిఆర్ బృందం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రా్రష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారంనాడు కేంద్ర ఆహార వినియోగారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం వానాకాలం, యాసంగి సీజన్లలో పండించే వరి పంటలో కోటి 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్బంగా మంత్రి కేటిఆర్ కేంద్రానికి నివేదించారు. తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, వాతావరణ పరిస్థితులు , రైతులనుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్ల పట్ల కేంద్రం సానుకూలతతో వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర మంత్రి కేటిఆర్ బృందంతో చర్చల అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్సందిస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి 70లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామని స్సష్టం చేశారు .దీనిపై మరింత సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ సమావేశంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఏడాది మొత్తంగా రెండు సీజన్లలో 150లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కేంద్రాన్ని కోరింది. ఆలా కాకుండా ఏ సీజన్‌లో ఎంత ధాన్యం ఉత్పత్తి జరుగుతుందో చెప్పాలని కేంద్రమంత్రి వివరాలను కోరారు.
రెండు సీజన్‌లలో ఏ సీజన్‌కు ఎంత ధాన్యం ఉత్పత్తి జరుగుతుందో ఒక నిర్దుష్టమైన అంచనాతో వస్తే తాము కూడా ఒక నిర్ణయానికి వచే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ తెలపారు. దీంతో ఈనెల 26న మరో సారి సమావేశం కావాలని , ఆ తరువాతే ధాన్యం కొనుగోలుపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి గోయల్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశం అనంతరం మంత్రి కేటిఆర్ ప్రతినిధి బృందాన్ని వెంటబెట్టుకుని వ్యవసాయా శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ దగ్గరకు స్వయంగా తనే తీసుకువెళ్లారు. కేంద్రమంత్రులతో సమావేశాలు ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు నేరుగా ముఖ్యమంత్రి కేసిఆర్ వద్దకు వెళ్లారు. కేంద్రమంత్రులతో జరిగన చర్చల సారాంశాన్ని సిఎంకు నివేదించారు. మంత్రి కేటిఆర్ బృందంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపిలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, మాలోతు కవిత, లింగయ్య యాదవ్ , పసునూరి దయాకర్, బిబి పాటిల్ , మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం నుంచి సిఎష్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సిఎస్ రామకృష్ణారావు, రఘునందన్ రావు , అనిల్ కుమార్ తదితరులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
ధాన్యంపై కేంద్రం మళ్లీపాతపాటే!
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం మళ్లీ పాతపాటే పాడుతోంది. వరిసాగులో రాష్ట్ర పరిస్థితులు , రైతుల సమస్యలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ధాన్యం కొనుగోలు పట్ల మొండివైఖరి వీడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రం నుంచి పండిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల మాత్రం గిరిగీసుకున్న ఆంక్షలతో పక్షపాత ధోరణి కనబరుస్తోందటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాకాలంలో 62లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రాష్ట్రంలో కోటి 35లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం దిగుబడులు లభించనున్నాయి. గత యాసంగిలోనూ 50లక్షల ఎకరాల మేరకు వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఇంకా స్పష్టతనివ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ్రప్రభుత్వం వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్దం చేసింది. పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సానుకూల ధోరిణితో ప్రభుత్వ విధానాలకు చేయూత నివ్వాల్సిందిపోయి పక్షపాత ధోరణితో వ్యవహరించటం తగదని రాష్ట్ర రైతులు , రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.