Thursday, December 26, 2024

ఎదిగిన కొద్దీ ఒదిగిన అజీం ప్రేమ్‌జీ జీవితమే మంచి పాఠం

- Advertisement -
- Advertisement -

KTR who Launched Wipro consumer care industry

మహేశ్వరం వద్ద దాదాపు 300 కోట్లతో విప్రో పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్రేమ్‌జీ పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శప్రాయుడు

విప్రోలో కాలుష్యం విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు
టిఎస్‌ఐపాస్ ద్వారా15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నాం
ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 2,20,000 కోట్ల మేరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి
16లక్షల ఉద్యోగాలు ఏర్పడ్డాయి: మహేశ్వరం మండలం కెసి తండా సమీపంలోని జనరల్ పార్కుల్లో విప్రో కన్జ్యూమర్ కేర్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కెటిఆర్
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ప్రోత్సాహకారంగా ఉన్నాయి: ప్రేమ్‌జీ

మన తెలంగాణ/మహేశ్వరం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, అజీమ్ ప్రేమ్‌జీ లాంటి వారు మహేశ్వరంలో 3వందల కోట్ల రూపాయలతో విప్రో సంస్థను నెలకొల్పి 9 వందల మందికి ఉపాధి కల్పించడాన్ని పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం మండలం కెసితాండ సమీపంలోని జనరల్ పార్కులో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డితో కలిసి విప్రో కన్జూమర్ కేర్ పరిశ్రమను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ టిఎస్ ఐపాస్ ద్వారా సరళతర వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం అందరికీ అనుసరణీయం, మంచి పాఠం లాంటిదని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందిరికీ ఆదర్శమన్నారు. విప్రో సంస్థ రాష్ట్రంలో మరిన్ని యూనిట్లు నెలకొల్పాలని ఆకాంక్షించారు.

దాదాపు రూ.300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని, కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. అజీమ్ ప్రేమ్‌జీ ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా తన సంపాదనలో సేవా కార్యక్రమాలకు కోట్లాది నిధులు ఖర్చుచేస్తున్నారని, కొవిడ్ సమయంలో రూ.44 కోట్లతో సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టారని కెటిఆర్ అభినందిస్తూ.. ప్రేమ్‌జీ దాతృత్వాన్ని కొనియాడారు. ఎల్‌ఈడి పరిశ్రమతోపాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ కోరారు. టిఎస్ ఐపాస్ విధానం ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా ఏడేళ్లలో 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు.

విప్రో ఫౌండేషన్ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం కీలకంగా నిలిచింది. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాం. పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నాం” అని తెలిపారు. విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్న ముందడుగు ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుందన్న విధంగా విప్రో సంస్థ రాకతో మహేశ్వరం రూపురేఖలు మారాయన్నారు. నగర శివారు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నా.. స్థానికులు సహకరించినప్పుడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, రంగారెడ్డి జడ్పి చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, విప్రో సిఇఓ వినీత్ అగర్వాల్, సిఓఓ అనిల్ కేరైనా, ఎంపిపి కె.రఘుమారెడ్డి, వైప్‌ఎంపిపి ఆర్.సునితా అంద్యా నాయక్, సర్పంచ్ జె.మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News