Saturday, December 21, 2024

ఫార్మాసిటీ ఉన్నట్టా.. లేనట్టా? :కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నగరంలో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరారు. వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలిపే ఉద్దేశంతో ఫార్మా సిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్ట్‌ను కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తుల్లో దేశంలోనే 40 శాతం వాటా కలిగి ఉందని, వెయ్యికి పైగా లైఫ్ సెన్సెన్స్ కంపెనీలకు రాష్ట్రం అడ్డాగా ఉందని తెలిపారు.

ఏటా 80 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను తెలంగాణ నుంచి తయారు చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలిసే ఉంటుందని, ఇలాంటి కీలకమైన రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగటంతో పాటు మన యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్లుగా సిఎం ప్రకటించటంతో ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఆందోళన చెందాయని పేర్కొన్నారు. అదే విధంగా ఫార్మా సిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత, బతుకులు బాగుపడుతాయని భూములు ఇచ్చిన రైతుల్లో కూడా ఇప్పుడు గందరగోళం నెలకొని ఉందని, ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అన్న అంశంపై చాలా ఊహాగానాలు కొనసాగుతున్నాయన్నారు. అసలు ప్రాజెక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించే ముందు భూములు ఇచ్చిన రైతులతో గానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థలతో గానీ ఎందుకు సంప్రదింపులు జరపలేదో చెప్పాలని అడిగారు.

తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర పురోగతి దెబ్బతింటుంది
సరైన రోడ్ మ్యాప్ లేకుండా సిఎం చేసిన ప్రకటనతో ఫార్మా సిటీ భవితవ్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోందని కెటిఆర్ అన్నారు. ప్రాజెక్ట్ కోసం రైతులు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడతామని ప్రభుత్వం చెబుతుండటం కూడా రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని భావిస్తే మాత్రం…ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఆ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడుతామంటే రైతులతో పాటు బిఆర్‌ఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను వేరే అవసరాలకు వాడితే న్యాయపరమైన సమస్యలు కూడా తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలు, అనిశ్చితితో కూడిన తొందరపాటు నిర్ణయాల కారణంగా రాష్ట్ర పురోగతి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటాయని భావిస్తున్నట్లు కెటిఆర్ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News