Saturday, November 23, 2024

రజాకార్ సినిమాపై కెటిఆర్ స్పందన

- Advertisement -
- Advertisement -

బిజెపిపై ఘాటు వ్యాఖ్యలు..సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్న మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : నిజాం పాలన, అప్పట్లో రజాకార్లు చేసిన అకృత్యాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ‘రజాకార్‌’ సినిమా వివాదాలకు తావిస్తోంది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ వివాదాస్పదమవుతోంది. ఓ వర్గాన్ని విలన్‌గా చూపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంట్రవర్సీగా మారిన ఈ టీజర్‌పై మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బిజెపికి చెందిన కొంతమంది జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని కెటిఆర్ సీరియస్ అయ్యారు.

తెలంగాణ శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ పోలీసులు కూడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఖుర్రం ముబాషిర్ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో రజాకార్ సినిమా టీజర్‌ను పోస్ట్ చేస్తూ మంత్రి కెటిఆర్, తెలంగాణ సిఎంవొ, హరీష్ రావు, తెలంగాణ డిజిపి, హైదరాబాద్ సిిపి సివి ఆనంద్, హోంమంత్రి మహమూద్ అలీ హ్యాండిల్స్‌కు ట్యాగ్ చేశారు. రజాకార్ సినిమా టీజర్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని, చరిత్ర గురించి బూటకపు ప్రచారం చేస్తున్నారని జర్నలిస్ట్ ముబాషిర్ ఆరోపించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేసి తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీంతో ఆయన పోస్ట్‌కు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ టీజర్‌పై మండిపడ్డారు. ముస్లింలను నేరస్తులుగా ఈ టీజర్‌లో చూపించడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాను విడుదల కానివ్వమని, అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. రజాకార్ సినిమా యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వస్తుండగా, గూడురు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. వీరి వెనుక బిజెపి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ‘రజాకార్ల ఫైల్స్’ సినిమాను తెరకెక్కిస్తామని రాష్ట్ర బిజెపి నేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అంతేకాకుండా గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదల అవ్వగా దీనికి బిజెపి బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. అలాగే పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా రాగా.. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదాస్పదమైంది. ఈ సినిమా చూడాల్సిందిగా స్వయంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల క్రమంలో ‘రజాకార్’ సినిమా వస్తుండటం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News