Monday, January 20, 2025

పేపర్ లీకేజీపై భగ్గుమన్న కెయు విద్యార్థి సంఘాలు

- Advertisement -
- Advertisement -

హనుమకొండటౌన్ : టిఎస్‌పిఎస్‌సి లీకేజీపై కాకతీయ యూనివర్సిటీలో నిరుద్యోగ విద్యార్థులు ఒక్కసారిగా మండిపడ్డారు. బుధవారం కెయు విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై జెఎసి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో నిరుద్యోగ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈనిరసన యూనివర్సిటీలోని లైబ్రరి నుండి కెయు రెండోగేట్ వరకు భారీ ర్యాలీ తీసి విసి భవన్‌ను ముట్టడించారు. విసి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. మూడుగంటలైనా కూడా విసి స్పందించకపోవడంతో విద్యార్థులు భవనం లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కొద్ది సేపు పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఉక్రోషానికి గురై విసి భవనంలోని కిటికిలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఏకంగా ఇద్దరు విద్యార్థులైతే భవనం ఎక్కి నినాదాలు చేశారు.

ఈ సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని విద్యార్థులను నిలవరించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణ జరగడానికి ముఖ్య కారణం సభకు అనుమతి ఇవ్వక పోడమేనని అంటున్నారు. మొదట మార్చి 24న కెయులో విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించాలని జెఎసి నిర్ణయించింది. కాని అనివార్య కారణాల వల్ల ఆసభను మార్చి 29న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సభకు విసి అనుమతి ఇస్తానని చెప్పి తీరా ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీతో విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతున్నాయంటూ వారికి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జెఎసి ఆధ్వర్యంలో కెయులో మహా ధర్నా నిర్వహించారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని 12 మంది విద్యార్థి జెఎసి నాయకులను అరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News