Friday, December 20, 2024

కూకట్‌పల్లిలో ముక్కోణపు పోటీ

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈ సారి ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారనే దానిపై తెలుగురాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది. 2018 అసంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్ధిగా నందమూరి వారసురాలు నందమూరి సుహాసినీ పోటీ చేయగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా స్థానిక వాసి మాధవరం కృష్ణారావు రెండో సారి బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంపై రెండు రాష్ట్రాల్లో భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. అనూహ్యంగా మాధవరం కృష్ణారావు సుహాసినీపై 40వేల పై చీలుకు మెజార్టీతో విజయం సాధించారు. సుహాసినీ గెలుస్తుందని ఆశించిన బెట్టింగ్‌రాయుళ్ళు నోరెళ్ళబెట్టిన పరిస్థితి ఆనాటిది. తాజాగా జరుగుతున్న అసంబ్లీ ఎన్నికల్లో అనివార్యంగా ముక్కోణపు పోటీ నెలకొంది.ఈ సారికూడా తెలుగురాష్ట్రాల్లో ప్రతేక ఆసక్తి నెలకొంది. ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో అనేదానిపై వినూత్న చర్చకు తెరలేసింది.

అభివృద్ధ్ది, సంక్షేమమే ఎజెండాగా బిఆర్‌ఎస్ దూకుడు
అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా మాధవరం కృష్ణారావు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలన్న లక్షంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో గత తొమ్మిదన్నర కాలంలో సిఎం కెసిఆర్ అభివృద్ధ్ది , సంక్షేమం, రాష్ట్రంలో పట్ల ఉన్న విజన్‌తో ప్రజల్లో సానుకూల వాతవరణం తనకు గెలుపునకు దోహదపడతాయని భావిస్తూ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరు, స్థానిక వాసికావడం, స్థానికుడు, సెటిలర్సు అన్న బేధం లేకుండా తొమ్మిదిన్నర ఏళ్ళ కాంలో కొందరి వాడు అని కాకుండా అందరి వాడు అన్న పేరుతెచ్చుకున్నారు. అందరిని సమాన దృష్టితో చూసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన తీరు మెజార్టీ ప్రజల్లో మాధవరం పట్ల సానుకూల వాతవరణం ఉంది. గతంలో సమస్యలకు నిలయంగా ఉన్న కూకట్‌పల్లి ప్రాంతంలో మంచినీరు, ట్రాఫిక్, విద్యుత్ వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు స్థానికంగా ఉన్న మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా ప్రజలకు చేరవేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.

బిజెపి బలం..సెటిలర్సు బలగంతో జనంలోకి జనసేన
బిజెపి జనసేన పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన బరిలోకి నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూకట్‌పల్లినియోజకవర్గంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మొదటిసారి జనసేన పార్టీ బరిలోకి దిగడం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. జనసేన పార్టీకి కూకట్‌పల్లిలో పెద్ద సంస్థాగత నిర్మాణం లేక పోయినప్పటికి ఆ పార్టీ తన మిత్రపక్షమైన బీజేపీని, నియోజకవర్గంలో సెటిలర్సు ఓటు బ్యాంకు బలంగా నమ్ముకుని ఆపార్టీకి బరిలోకి దిగింది. స్థానికంగా సెటిలర్సులలో అత్యదిక మంది కాపు , తూర్పు కాపు సామాజిక వర్గాలు ఇక్కడ నివాసం ఉంటున్న నేపధ్యంలో ఆవర్గాలు తమ పార్టీకి అండగా నిలుస్తారన్న విశ్వాసం ఆపార్టీ నాయకుల్లోకనిపిస్తుంది.

జనసేన పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ ఆంధ్రా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కూకట్‌పల్లిలో సంస్థాగతంగా నిర్మాణం కలిగి ఉండి బిజెపి బలంతో, తన సామాజిక వర్గం బలగంతో కలిసి గట్టెక్కాలని జనసేన అభ్యర్ధి ప్రేమ్‌కుమార్‌లో గత వారం రోజులుగా కూకట్‌పల్లిని చుట్టేస్తున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ది, సంక్షేమకార్యక్రమాలు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేరును ఉచ్చరిస్తూ ఓటును అభ్యర్ధిస్తున్నారు. కమ్యూనిటీ వర్గాల వారిగా సమావేశమవుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రాలో మిత్రక్షంగా ఉన్న టిడిపి ఇక్కడ కూడా సహకరిస్తే తమ విజయం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

సెటిలర్సు సెంటిమెంట్…ఆరు గ్యారంటీలే ఆయుధంగా కదన రంగంలోకి కాంగ్రెస్
నియోజకవర్గ క్యాడర్‌తోకాని, ప్రజలతో కాని ఎలాంటి సంబంధం లేకుండానే పారాషూట్ మాదిరిగా కాంగ్రెస్ టికెట్‌తో కూకట్‌పల్లిలో వాలిపోయిన బండి రమేష్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కమ్మసామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి బండిరమేష్ ప్రధానంగా సెటిలర్సు ఓటు బ్యాంకును నమ్ముకున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా బీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు, ఆరోపణలతో క్యాడర్‌ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి ఈసారి పోటీలో లేకపోవడంతో ఆపార్టీ సానుబూతిపరులు ముఖ్యంగా ఓ సామాజిక వర్గం తనను ఆదరిస్తారన్న గట్టి విశ్వాసంతో ఉన్నారు. గట్టిగా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తే గట్టెక్కకపోతానా అన్న గంపెడాశతో బండి ప్రచారం సాగుతొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News